
అమ్మంటే..ప్రేమ, ఆప్యాయత , అనురాగం, మమకారం.
అమ్మంటే..మార్గదర్శి, కార్యదక్షురాలు, శిక్షకురాలు.
అమ్మంటే... మందలింపు, అదిలింపు, దారితప్పిన వారికి బెదిరింపు.
జగత్తంతటికీ తల్లి అయిన జగదాంబ తత్త్వం ఇదే. మనలో నిలిచి ఉండి, నడిపించేది ఆ అమ్మే. పరతత్త్వానికి ప్రతీకగా నిలిచే అపరాజిత పూజకు సమయం ఆసన్నమైంది. ఆమెను తెలుసుకుందాం... మనసారా కొలుచుకుందాం...
దేవీ భాగవతంలో జగన్మాత తన గురించి బ్రహ్మకు స్వయంగా చెబుతూ... ఈ సృష్టిలో నేను కానిది ఏదీలేదని వివరిస్తుంది. ‘బుద్ధి, శ్రీ, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, స్పృహ, వాంఛ, శక్తి, వస, వాక్కు, మజ్జ, వృష్టి, చర్మం, రుతం, అనృతం.... ఇలా అన్నీ నేనే’ అంటుంది. సర్వ దేవతా రూపంనాదే. శక్తిని, పరాక్రమాన్ని నేనే అని చెబుతుందామె. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరులు సైతం ఆ పరాశక్తికి లోబడి ఉన్నవారే. సృజన, పాలన, సంహారకాలనే మూడు శక్తులున్న ఆమె త్రిశక్తి స్వరూపిణి. వాటిలో బ్రహ్మకు సృజన శక్తిని, విష్ణువుకు పాలనా శక్తిని, శివుడికి సంహార శక్తిని ప్రసాదించి బ్రాహ్మి (సరస్వతి), వైష్ణవి(లక్ష్మి), శివాని (పార్వతి) రూపాల్లో వారి వెన్నంటి ఉండి లోకరక్షణ చేయిస్తోంది సాక్షాత్తు భగవతే అని దేవీ భాగవతం వివరిస్తోంది.
విశ్వమంతా వ్యాపించిన ఉన్న శక్తి ఒక్కటే. ఏకరూపంలోని ఈ శక్తి వివిధ అవతారాలను ధరించిందని ‘శ్వేతాస్వతారోపనిషత్తు’ చెబుతోంది. అన్నీ, అంతా తానైన దేవి ఎన్ని రూపాలు ధరించినా మూలశక్తి మాత్రం ఒకటే. ఈ విషయాన్ని నిరూపించేదే నవ శబ్దం. తొమ్మిది గుణిజాలు ఎన్నో ఉన్నా, అవి ఎంత పెద్దవి అయినా అన్నీ కలిపితే చివరికి మిగిలేది తొమ్మిదే. జగత్కారిణి అయిన దేవి ఎన్ని రూపాలు ధరించినా ఆమె తత్త్వం ఏకత్వం. భిన్న రూపాల్లో, శక్తుల్లో ఉన్న పరతత్త్వం ఆమే. ఇదే నవరాత్రి అంతరార్థం.
ప్రతి జీవిలోని చైతన్యం ఆమే. అలా అయినప్పుడు ఆ జీవిలో ఉన్న సర్వాంశలూ ఆమెవే కదా. రక్ష (రక్షించే), మంత్ర (మంత్రపూర్వక ఆవాహన), ప్రాణ (సకల జీవులకీ మూలమైన ప్రాణం), కళా (అన్ని కళలు), విశ్వ (విశ్వమంతటా వ్యాపించిన), విద్యా (సకల విద్యలు ఇచ్చే), వాగ్వైభవ (మాట్లాడే తీరు తెలిపే), సంహార (దుష్ట నాశనం), ధార్మిక (ధర్మమార్గాన నడిచేలా చూసే)... అనే నవవిధ శక్తుల సమాహారం జగన్మాత అని పురాణ కథనం. సృష్టికి, దాని గమనానికి దోహదపడే దేవతలందరికీ ఆధారభూతురాలు. ఆమె మహావిద్య, మహామాయ, పూర్ణరూపిణి, ప్రకృతి. అవ్యయ (మార్పు లేనిది) ఇచ్ఛారూపిణి (కోరుకున్న రూపం ధరించేది). వేదగర్భ(వేదాలకు మూలం), సర్వాధిష్టాన (సృష్టి అంతటికీ అధిదేవత)... అని దేవీభాగవత కథనం. ‘నవ’ అనే శబ్దానికి కొత్తది, తొమ్మిది, అనే అర్థాలతో పాటు ‘నూయతే స్తూయతే ఇతి నవః’... స్తుతి చేస్తే సుఖాలనిచ్చేది అనే అర్థం కూడా ఉంది. దేవిని తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో పూజించే వ్రతాన్ని నవరాత్రి వ్రతం అంటారు. దీన్ని ఆచరిస్తే పాపాలన్నీ హరించిపోయి ముక్తులవుతారు అని పురాణాలు చెబుతున్నాయి
ఆమె శారద:- శరత్కాలం ఆహ్లాదకరమైనది. దేవి అవతరించిది ఈ కాలంలోనే. శరది భవా శారదా... శరత్కాలంలో పుట్టింది కాబట్టి దేవికి శారద అనే పేరు వచ్చింది. ఆమె లోకకంటకులైన రాక్షసులని మట్టు పెట్టింది ఈ నవరాత్రుల్లోనే. సంవత్సరంలో మూడు రకాల నవరాత్రులు జరిపే సంప్రదాయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, గణేశ చతుర్థి పురస్కరించుకుని భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో శారదను స్తుతించే తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులుగా నిర్వహించుకుంటాం. వీటిలో శరన్నవరాత్రులు అత్యంత ప్రశస్తమైనవిగా భావిస్తారు. జగదాధారిణి అయిన జగన్మాతని కొలిచే నవరాత్రులు కావడంతో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో దేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం వస్తుందని నమ్ముతారు.
- రమాశ్రీనివాస్
ఏంటీ అలంకారాలు?

శరన్నవరాత్రులలో అన్ని శక్తి క్షేత్రాల్లోనూ అమ్మవారిని రోజుకొక్క రూపంలో అలంకరిస్తారు. దేవీ భాగవత పురాణం, తంత్రశాస్త్ర గ్రంథాలు ఈ రూపాలకు ప్రామాణికాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని భ్రమరాంబ, వరంగల్ భద్రకాళి తదితర క్షేత్రాల్లో అమ్మవారికి విశేషమైన అలంకారాలు చేసే ఆచారం ఉంది. సాధారణంగా లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపురసుందరి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, దుర్గ, మహాలక్ష్మి, మహిషాసుర మర్దిని, మహాకాళి, రాజరాజేశ్వరి రూపాలలో అమ్మ కొలువుదీరతారు. వీటికి పురాణ సంప్రదాయం ప్రామాణికం. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ‘స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి’ రూపం కూడా కనిపిస్తుంది. మొదటి రోజు ఈ అలంకారం చేయటం స్థానిక సంప్రదాయం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.. ఇవి అమ్మవారి రూపాలు. దశ మహావిద్య స్వరూపాలివి. నవరాత్రి సందర్భంగా శ్రీశైల భ్రమరాంబను ఈ రూపాలతో కొలుస్తారు. వీటికి తంత్రశాస్త్ర గ్రంథాలు ప్రమాణం. మార్కండేయ పురాణం దేవి రూపాలను వేరుగా చెబుతోంది. దీని ప్రకారం మహాకాళి, మహిషాసుర మర్దిని, చాముండి, నంద, రక్తదంతి, శాకంబరి, దుర్గ, మాతంగి, భ్రామరి అనేవి అమ్మ రూపాలు.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించిన మాతకు దుర్గ అని పేరు. దుర్గం అంటే కోట. మంచికి పెట్టని కోటలాంటి జగన్మాత సకల శుభాలనూ ఇస్తుందని భక్తుల నమ్మకం. పరతత్త్వానికి, పరమోన్నత వ్యక్తిత్వానికి ప్రతీక అయిన ఈమెను తెలుసుకోవడమే ఆజన్మాంత తపస్సు. అలాంటి దుర్గా స్వరూపాన్ని నవరాత్రుల్లో కొలిచే సంప్రదాయం ఉంది.
1వ రోజు

శైలపుత్రి :- హిమవంతుని కుమార్తె. పర్వత పుత్రి కాబట్టి పార్వతి అనీ పిలుస్తారు. ఆమె వృషభ వాహిని, శూల ధారిణి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు. భూ తత్త్వానికి ప్రతీక అయిన ధూసర వర్ణంలో కనిపిస్తారు. అమ్మకు బూడిద రంగు వస్త్రాలను అలంకరిస్తారు.
2వ రోజు

బ్రహ్మచారిణి:- హిమవంతుని కుమార్తె అయిన పార్వతి నారదుని ద్వారా తన గతజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంది. అప్పుడు తాను దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవినని, నారదుని ఉపదేశంతో ఈ జన్మలోనూ శివుని భర్తగా పొందడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. ఆ రూపం బ్రహ్మచారిణి. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం, తెల్లటి వస్త్రాలతో దర్శనమిస్తుంది. తపస్సు చేసింది కాబట్టి తపశ్చారిణి అనీ పిలుస్తారు. ఈమెను పూజిస్తే వైరాగ్యం, సాధు జీవనం, అన్నింటా విజయం దక్కుతాయని నమ్ముతారు..
3వ రోజు

చంద్రఘంట: తలపై అర్ధచంద్రుడితో దర్శనమిచ్చే తల్లి ఈమె. పది భుజాలు... యుద్ధానికి సన్నద్ధమైనట్లు ధనుస్సు, బాణం, గద, శూలం, ఖడ్గం, పాశంతో దర్శనమిస్తుంది. పద్మం, కమండలం, అభయ హస్తం, వరద హస్తాలతో అలరారుతుందీమె. పౌర్ణమినాటి చంద్రుడిలాంటి గౌరవర్ణంలో దర్శనమిచ్చే అమ్మవారు భక్తుల మనస్సులకు ప్రశాంతతనిస్తారు. ఈ దేవిని పూజించడం వలన ధైర్యం, శత్రువుల్ని జయించే శక్తి కలుగుతుందని నమ్ముతారు.
4వ రోజు

కూష్మాండ:- పృథ్వికి ప్రతీక కూష్మాండం. అంటే గుమ్మడికాయ. సకల సృష్టికీ కారణమైన జగన్మాతను కూష్మాండగా కొలుస్తారు. ఈ రూపంలో దేవికి ఎనిమిది చేతులు. అందువల్ల అష్టభుజాదేవి అనీ పిలుస్తారు. చక్రం, గద, ధనుస్సు, బాణం తదితర ఆయుధాలతో పాటు కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం ధరించి దర్శనమిస్తారు. ఈ రూపంలో పూజించడం వల్ల రోగాలు నశించి ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయి. కర్తవ్య దీక్షకు సూచిక అయిన ఎరుపు రంగు దుస్తులను అమ్మకు అలంకరిస్తారు.
5వ రోజు

స్కందమాత: సింహవాహిని అయిన స్కందమాతది నాలుగు చేతుల రూపం. ఒక చేతిలో కుమారుడైన స్కందుణ్ణి, రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉంటారు. అభయ ముద్రలో దర్శనమిస్తారు. అమ్మను ఈ స్వరూపంలో పూజించడం వల్ల శాంతి, సౌఖ్యం కలుగుతాయని చెబుతారు. ఆకాశానికి, విశాలతత్వానికీ ప్రతీక అయిన నీలం రంగులో అమ్మను భావిస్తారు.
6వ రోజు

కాత్యాయని :- త్రిమూర్తుల తేజంతో అలరారుతుందీ దేవి రూపం. మహిషాసురుణ్ణి సంహరించడానికి ఎత్తిన ఈ అవతారాన్ని ముందుగా కాత్యాయనుడు అనే ముని పూజించడం వల్ల ఈమెకీ పేరు వచ్చింది. నాలుగు చేతులున్న తల్లి వాహనం సింహం. ఒక చేతిలో ఖడ్గం, రెండో చేతిలో కమలం ధరించి దర్శనమిస్తారు. మిగిలిన రెండు చేతులూ వరద ముద్ర, అభయ హస్తంగా ఉంటాయి. కష్టాలు బాధలు తీరాలనే కోరికతో ఈ రూపంలో పూజిస్తారు. ప్రకృతికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగులో దర్శనమిచ్చే తల్లిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు.
7వ రోజు

కాళరాత్రి :- విరబోసుకున్న జుట్టు, నల్లని మేని ఛాయ, నాలుగు భుజాలతో గార్దభ వాహనంపై ఉంటుంది. అంత భయంకర రూపంలోనూ నాలుగు భుజాల్లో రెండు అభయ హస్తంగా , వరప్రసాద ముద్రలతో దర్శనమిస్తుంది. దుష్టులకు మాత్రమే భయంకరి. శిష్టులకు అభయంకరి అనే భావన ఇమిడి ఉందీ రూపంలో. పాపాలు, గ్రహ బాధలు తొలగిపోవడం ఈ రూపంలో దేవిని పూజించినందుకు ఫలితాలని చెబుతారు. అజ్ఞానానికి, అంధకారానికి ప్రతీక నలుపు. అజ్ఞానాన్ని తొలగించుకుని కొత్త వెలుగుల వైపు పయనించాలని అమ్మ నల్లని మేని రంగులోని ఉపదేశం. ఈమెను ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు.
8వ రోజు

మహాగౌరి :- వృషభ వాహిని. చతుర్భుజాలు కలిగి ఉండే ఈమె చేతుల్లో త్రిశూలం, ఢమరుకం, అభయ ముద్ర, వరప్రసాద ముద్రలతో దర్శనమిస్తుంది. తెల్లని వర్ణంలో అమ్మ కనిపిస్తుంది. శ్వేతవస్త్ర ధారిణి. ఈమెని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని చెబుతారు.
9వ రోజు

సిద్ధిదాత్రి :- సర్వసిద్ధులను ప్రసాదించేది కాబట్టి ఈమెకీ పేరు. కమలం ఈమె ఆసనం. నాలుగుభుజాలు కలిగి ఉంటుంది. వాటిల్లో శంఖం, చక్రం,గద, పద్మాలను ధరించి చుట్టూ భక్తులతో కొలువుదీరి ఉంటుంది. ఈ రూపంలో దేవిని పూజించడం వల్ల సర్వసిద్ధులు-శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.