Translate

Tuesday, November 26, 2019

మార్గశిర మాస విశిష్టత


మాసానాం మార్గశీర్షోహం – అన్నారు జగద్గురువు *శ్రీకృష్ణ పరమాత్మ*. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన *శ్రీమద్భగవద్గీత* అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ, కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమనీ చెప్పాడు. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి *ఉత్తరాయణం* ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే *దక్షిణాయనం* చివరిభాగం, *ఉత్తరాయణం* ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే *బ్రాహ్మీముహూర్తం* వంటిది. *బ్రాహ్మీ ముహూర్తం* రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది.

లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే. తొలిరోజు కార్తీకమాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలుటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాల పుణ్యప్రదం. కుదరనివారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతీరోజూ శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం.
మార్గశిర శుద్ధ తదియ నాడు *ఉమామహేశ్వర వ్రతం* చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది.
అలాగే *మార్గశిర శుద్ధ పంచమి* నాడు *నాగపంచమి* చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో, మరి కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు.

మార్గశిర శుద్ధషష్ఠి *సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం*. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునే వారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలూ, ఉత్సవాలూ, నాగప్రతిష్టలూ జరుగుతాయి.

*మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం*. దీనినే *కాలభైరవాష్టమి* అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవావతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంది కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కచూస్తుంటాడు. శునకం కాలభైరవస్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి, గారెలు వండి, దండగా గ్రుచ్చి, శునకం మెడలో వేస్తుంటారు.

*మార్గశిర శుద్ధేకాదశి *శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా *మోక్షద ఏకాదశి,* సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా, సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతీ ఒక్కరికీ కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్టానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచెప్పాడు. *భగవద్గీత నిత్యపారాయణ*, నిత్య ఆచరణా గ్రంథమైనప్పటికీ, విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలచుకుని గీతాపారాయణ, గీతా అధ్యయనం, అనుష్టానం చేయాలి.

మార్గశిర శుద్ధ ద్వాదశిని *మత్స్య ద్వాదశి* అంటారు. దశావతారాలలో తోలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు.

మార్గశిర శుద్ధపూర్ణ *శ్రీ దత్తజయంతి*. దీనినే కోరలపూర్నిమ, *నరక పూర్ణిమ* అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా అత్ర్యనసూయలకు జన్మిన దత్తాత్రేయుడు, మౌనముద్రతోనే ఉపదేశం చేసి, పరమగురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యనభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్త్వాన్ని లోకానికి ఎరుకపరచి గురువులకే గురువైన అవధూత. ఈనాడు దత్తచరిత్ర పారాయణ చేసి, ఆ పరమగురువుని స్మరించుకుంటారు.

మార్గాశిరమాసంలో వచ్చే లక్ష్మివారం(గురువారం) నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి, వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి, వ్రతకథను చదువుకొనాలి. అలా అ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాలూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి, ఆనాడు తమ శక్త్యనుసారం ముత్తైదువలకి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ పువ్వులు, తాంబూలం మొదలగు మంగళద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణప్రోక్తం.

ఇంకా మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన *ధనుర్మాసం* వస్తుంది.

Sunday, November 17, 2019

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

Tuesday, November 5, 2019

మారేడు వృక్షం విశిష్టత

మారేడు వృక్షం విశిష్టత ఏంటి?

త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. శివరాత్రి నాడు తెలిసో తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. శివాలయాలలో నిత్యం బిల్వార్చనలు (మారేడు దళాలతో అర్చనలు), పర్వ దినాలప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతుంటారు. ఇలా చేయటమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. ‘మారేడు (మారాజు) నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని తెలుగు కవులు మారేడు పదాన్ని శ్లేషార్థంగా చెప్పిన సందర్భాలు సాహిత్యంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం ఇలా వివరిస్తోంది. ఈ వివరణలోనే శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా కనిపిస్తున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు విశిష్టత ఇదే!

మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తుంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుడిని పూజించటం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది. గంధ పుష్పాదులతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకార్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానం, సుఖం వర్థిల్లుతూ ఉంటుంది. 

మారేడు వృక్షం విశిష్టత ఏంటి?

మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగుళ్ళతో ఉన్న మారేడు కొమ్మను తాకటం, ఆ చెట్టును పూజించటం లాంటివి పాప విముక్తికి దోహదకారులు. అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ చెట్టు కింద పాలు, నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు. శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందిన వాడు మహా పుణ్యాత్ముడవుతాడు. శివ ప్రసాదంలో పత్రం, పుష్పం, ఫలం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శవల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి. శివపూజ చేసే వారిలో ప్రధానంగా రెండు రకాల వారుంటారు. ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి నివృత్తి అనే రెండు భక్తి మార్గాలలో భక్తులు శివపూజ చేస్తుంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. అలా చేయటం వల్ల వారికి సర్వ దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తుంటారు. పూజ అయిన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేసి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తుంటారు. నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యం పెడతారు. 

ఓంకారాన్ని సూక్ష్మ లింగంగా భావించి ఉపాసించటం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత. ఆ భక్తులు లింగాన్ని విభూతితో అర్చించటం, ఆ విభూతిని నైవేద్యంగా ఇవ్వటం కూడా ఉంది. అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు. ఇలా ఈ కథా సందర్భంలో మారేడు చెట్టు మహిమ గురించి శివభక్తులలోని ప్రవృత్తి, నివృత్తి అనే మార్గాలననుసరించే భక్తులను గురించి వివరించటం కనిపిస్తుంది. మారేడు వృక్షం ఇంత పవిత్రతను సంతరించుకొని ఉండటానికి ఆ చెట్టు దళాలు, బెరడు అన్నిటిలోనూ ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్నారు

Friday, November 1, 2019

భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు (చింతా గోపి శర్మ సిద్ధాంతి భువనేశ్వరి పీఠం వారి వాట్సప్ పోస్ట్ నుండి)

ఆధ్యాత్మికతతో నిండిపోయుండే భారతీయ హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. శివుని అక్షుల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. 

ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు.. అందరూ వీటిని ధరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ గురువులు, స్వామిజీలు, బ్రాహ్మణులూ, పూజారులు, దైవజ్ఞులు.. వంటి వారు వీటిని ధరిస్తూ ఉంటారు. అంతేకాదు పూజా గదులలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ ఉన్నారు.

రుద్రాక్షలు అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉంది. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే ఉంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందు చూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు.

భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించిన భక్తులు ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయని.. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని 'జాబాలోపనిషత్' చెబుతోంది. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయని.. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాంద పురాణం చెబుతోంది.

రుద్రాక్షకు ఆ నామం ఎలా వచ్చింది?
రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, 3 పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటి నుంచి జన్మించినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధం. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు. 

ఇక రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవని తంత్ర శాస్త్రం చెబుతోంది. అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా చెప్పబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణం కూడా ముఖ్యమే. 

రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.

రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. 

వాటి వివరాలు, ఉపయోగాలు ఏంటో చూద్దాం

1. ఏకముఖి రుద్రాక్ష
ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రతిరూపం. శివుని త్రినేత్రముగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఇది ధరించిన వ్యక్తికి వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.

2. ద్విముఖి
ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. శివపార్వతి రూపంగా నమ్ముతారు. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.

3. త్రిముఖి
త్రిముఖి రుద్రాక్షను త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.

4. చతుర్ముఖి
చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు వేదాల స్వరూపం. ఇది బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి తాగితే మానసిక వ్యాధులు దూరమవుతాయి. విద్యార్ధులకు మరింతా ఉపయోగం.

5. పంచముఖి 
పంచముఖి రుద్రాక్ష పంచభూత స్వరూపం. గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మంచిది. ఇది పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాదు శతృవులను సులభంగా జయించవచ్చు. 

6. షణ్ముఖి 
షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా వంటి వ్యాధులు దూరమవుతాయి.

7. సప్తముఖి 
సప్తముఖి రుద్రాక్ష కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని విశ్వాసం.

8. అష్టముఖి 
అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

9. నవముఖి 
నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపము. ఇది భైరవునికి ప్రతీక. దీనిని ఎడమ చేతికి ధరించాలి. దుర్గ ఆరాధకులకు మంచిది. 

10. దశముఖి
దశముఖి రుద్రాక్ష దశావతార స్వరూపము. ఇది జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగము చేసినంత ఫలితము కలుగుతుంది. దీనిని మహిళలు ఎక్కువగా ధరిస్తారు.

11. ఏకాదశముఖి 
ఏకాదశముఖి రుద్రాక్ష 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.

12. ద్వాదశముఖి 
ద్వాదశముఖి రుద్రాక్ష 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.

13. త్రయోదశముఖి  
త్రయోదశముఖి రుద్రాక్ష కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను తాగితే అందం పెరుగుతుంది.

14. చతుర్దశముఖి 
చతుర్దశముఖి రుద్రాక్ష 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమ శివుని కన్ను.

15. పంచదశముఖి 
పంచదశముఖి రుద్రాక్ష పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.

16. షోడశముఖి 
షోడశముఖి రుద్రాక్ష 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.

17. సప్తదశముఖి 
సప్తదశముఖి రుద్రాక్ష విశ్వకర్మకు ప్రతీక. దీని వల్ల ఆర్థిక సంపద కలుగుతుంది.

18. అష్టాదశముఖి 
అష్టాదశముఖి రుద్రాక్ష 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.

19. ఏకోన్నవింశతిముఖి 
ఏకోన్నవింశతిముఖి రుద్రాక్ష 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.

20. వింశతిముఖి 
వింశతిముఖి రుద్రాక్ష 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.

21. ఏకవింశతిముఖి 
ఏకవింశతిముఖి 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. అంతేకాదు జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.

రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు

రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.

ఎప్పుడు ఎలా ధరించాలి..? 
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి.
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం శుభకరం. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతో గూర్చి గానీ ధరించాలి.  

రుద్రాక్షను ధరించేముందు "ఓం నమశ్శివాయ" శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు 'మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం' చేయడం శుభకరం. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. 

రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది. సరైన ఆకృతి లేని రుద్రాక్షలను, ముల్లు లేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. రుద్రాక్షలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. 

జన్మనక్షత్ర రీత్యా  ధరించవలసిన రుద్రాక్షలు 

నక్షత్రము         ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని              నవముఖి
భరణి               షణ్ముఖి
కృత్తిక               ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి              ద్విముఖి
మృగశిర           త్రిముఖి
ఆరుద్ర              అష్టముఖి
పునర్వసు         పంచముఖి
పుష్యమి           సప్తముఖి
ఆశ్లేష               చతుర్ముఖి
మఖ                నవముఖి
పుబ్బ              షణ్ముఖి
ఉత్తర               ఏకముఖి, ద్వాదశముఖి
హస్త                ద్విముఖి
చిత్త                 త్రిముఖి
స్వాతి              అష్టముఖి
విశాఖ              పంచముఖి
అనురాధ          సప్తముఖి
జ్యేష్ఠ                చతుర్ముఖి
మూల              నవముఖి
పూర్వాషాఢ        షణ్ముఖి
ఉత్తరాషాఢ         ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం             ద్విముఖి
ధనిష్ట               త్రిముఖి
శతభిషం            అష్టముఖి
పూర్వాభాద్ర        పంచముఖి
ఉత్తరాభాద్ర          సప్తముఖి
రేవతి                 చతుర్ముఖి                                .