
భీష్మ పితామహుడు కారణజన్ముడు. శాపవశాత్తు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆ కారణంగానే సుదీర్ఘకాలం జీవించాడు. ఆయన వ్యక్తిత్వం రాజస సాత్విక ప్రవృత్తుల కలబోత. భీష్ముడి జీవన గమనంలో ఆ రెండూ తారుమారైన సందర్భాలున్నాయి.
భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అస్త్రవిద్యలో గురువైన పరశురాముణ్నే నిలువరించగల మహా పరాక్రమశాలి. అలాంటివాడు తమకు రాజవుతాడని ఆ దేశ ప్రజలు ఎదురుచూశారు. కాని, కథ మలుపు తిరిగింది. సత్యవతిని తన తండ్రికిచ్చి వివాహం చేసేందుకు అనువుగా భీష్మప్రతిజ్ఞ చేసి రాజ్యాధికారాన్ని, సంసార సుఖాన్ని ఆయన త్యాగం చేశాడు. తీరా సత్యవతి సంతానమైన చిత్రాంగద విచిత్రవీర్యుల అకాల మరణం కారణంగా కురువంశంలో మగబిడ్డ లేకుండాపోయాడు. ‘ఎవరి సంతతికి రాజ్యాధికారం సంక్రమించడం కోసం నీవు వివాహం చేసుకోలేదో, ఆ సంతానం మిగలలేదు. వంశాంకురాలనూ అందించలేదు కాబట్టి నీవు శపథం విడిచిపెట్టి పెళ్ళి చేసుకో...’ వంశాన్ని నిలబెట్టు అని సత్యవతే స్వయంగా ప్రాధేయపడింది. భీష్ముడు భీష్మించుకొని కూర్చున్నాడు. విధిలేక సత్యవతి వ్యాస మహర్షిని ప్రార్థించి తన కోడళ్లకు తగిన సంతానాన్ని ప్రసాదించమని కోరింది. ఆ ముని కారణంగా వంశం నిలిచింది.
ఒక మహాతపస్వి లోకహితం కోసం దిగిరాగా లేనిది ఆ పని భీష్ముడివల్ల ఎందుకు కాలేదంటే- ఆయన వ్యక్తిత్వం లోకహితం కోసం రాజీపడలేక పోయింది. అంటే, సాత్విక ప్రవృత్తి అవసరమైనచోట ఆయన రాజసం ఎదురు తిరిగింది.
నిండుసభలో ద్రౌపదికి తీరని అవమానం జరిగినప్పుడు గాని, కౌరవుల మూలంగా ధర్మానికి పలు సందర్భాల్లో హాని కలిగినప్పుడుగాని ఆయన తిరగబడలేదు. రాజస ప్రవృత్తిని లేదా క్షాత్ర ధర్మాన్ని పాటించి, ఆయనే కనుక విల్లుపట్టి నిలబడితే- యుద్ధంతో పనిలేకుండానే ధృతరాష్ట్రుడు సంతానం కుక్కిన పేనుల్లా పడిఉండేవారు. కృష్ణార్జునులకు తప్పిస్తే భీష్మాచార్యుడికి ఎదురునిలిచే సత్తా భూమిమీద ఎవరికీ లేదు. అలా రాజసానికి పెద్దపీట వేయవలసినచోట ఆయన సాత్విక ప్రవృత్తికి పట్టాభిషేకం చేశాడు.
ఆయుధం పట్టనని శపథం చేసిన పరమాత్మ తనకోసం ప్రతిష్ఠను, ప్రతిష్ఠను సైతం విడిచిపెట్టడం భీష్ముణ్ని విస్మయానికి గురిచేసింది. మెరుపు మెరిసినట్లయింది. వెంటనే మోకాళ్లపై కూలబడ్డాడు.‘చక్రాన్ని ఉపసంహరించకు, మహాత్మా... నన్ను సంహరించు’ అని చేతులు జోడించాడు.
తరవాతి కథంతా ‘శాంతిపర్వం’ సాత్విక గుణసంపదకు విజయగర్వం. శర తల్ప గతుడైన ఆ మహానుభావుడి దేహంనుంచి నెత్తురుబొట్లకు బదులుగా ఈ లోకానికి అవసరమైన ఎన్నో ధర్మసూక్ష్మాలు స్రవించాయి. రాజనీతి ప్రవహించింది. నోటి నుంచి లోకాన్ని వణికించే భీకర శంఖధ్వానమో, గంభీర సింహనాదమో కాదు- ఒడ్డుకు చేర్చే విష్ణుసహస్రనామ స్తోత్రం ప్రతిధ్వనించింది. ఆ కారణజన్ముడి పుట్టుకను పునీతం చేస్తూ ఒక పుణ్యతిథి ఆయన పేరిట లోకంలో స్థిరపడింది. అదే భీష్మఏకాదశి!
No comments:
Post a Comment