Translate

Friday, August 13, 2021

వివిధ నాగ జాతులు మరియు నాగ జాతి వివరాలు

                                               సర్పరాజు వాసుకి:tulip:

:snakenake::snake::snake::snake::snake::snake::snake::snake:
నాగజాతికి అధిపతి అయిన వాసుకి పేరు మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. క్షీరసాగర మధన సమయంలో మంధర పర్వతానికి తాడుగా ఉపయిగించింది ఈ వాసుకి సర్పరాజునే. వాసుకి కద్రువ కుమారుడు. జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని మాన్పించడానికి జరత్కారువును ప్రేరేపించిన వారిలో వాసుకి కూడా ఒకటి.

శతానీకుడు

జనమేజయుని కుమారుడు శతానీకుడు. శాతానీకునికి ఇద్దరు భార్యలు. ఇతనికి సంతానం కలగకపోవడంతో శాండిల్య మహాముని ఆధ్వర్యంలో ఇతడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఈ యాగం వల్ల సహస్రానీకుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చి, ఇతడిని సహాయం కోసం రావలసిందిగా కోరతాడు. రాక్షసులతో జరిగిన యుద్ధంలో శతానీకుడు మరణిస్తాడు. ఇతని భార్యలు సహగమనం చేస్తారు. దేవతలకూ, రాక్షసులకూ జరిగిన యుద్ధాలలో మానవజాతికి చెందినా రాజులు దేవతలకు సహాయం చేయడం సహజమే. పురాణాల ప్రకారం చూసినప్పుడు అలా జరిగిన యుద్దాలలో రాక్షసుల చేతిలో మరణించిన ప్రముఖ రాజు శతానీకుడు.

సంపాతి జటాయువు

జటాయువు ఒక పక్షి. అనూరుడు, శ్యేనిల కుమారుడితడు. సంపాతి సోదరుడితడు. చిన్నతనంలో సోదరురిద్దరూ ఎవరు ఎంత ఎత్తుకు ఎగరగలరో అని పోటీపడి ఇద్దరు సూర్యమండలం వరకూ వెళతారు. సంపాతి రెక్కలు మాడిపోయి ఒకచోట. జటాయువు సొమ్మసిల్లి మరోచోట పడిపోతారు. రావణాసురుడు సీతను అరణ్యం నుంచి అపహరించుకుని వెడుతుండగా, జటాయువు అతనికి అడ్డంపడి, సీతను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. జటాయువు రెక్కలను రావణాసురుడు ఖండించడంతో రెక్కలు తెగిన జటాయువు అంత్యక్రియలు రాముడే నిర్వర్తిస్తాడు. జటాయువు మరణించిన తర్వాత అనుకోకుండా వానరులు సంపాతిని కూడా కలుస్తారు. జటాయువు సోదరుడే సంపాతి అని తెలుసుకుంటారు. జటాయువు మరణించాడని తెలుసుకున్న సంపాతి తన కుమారులైన సుపార్శ్వుడు, బభ్రువు, శీఘ్రగుడులను కూడా వానరులకు సహాయంగా పంపుతాడు.

పరీక్షిత్తు

పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు, ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది.

గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించినప్పుడు, అతడు పరీక్షిత్తును కాపాడాడు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.

ఉత్తరుని కుమార్తె ఐరావతిని పరీక్షిత్తు వివాహమాడాడు. ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరతాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తను వెన్నాడి వచ్చిన మృగమేదని అడుగుతాడు.

తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, అక్కడ చచ్చి పడి ఉన్న పాము కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు. అని శపిస్తాడు.

చివరకు తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెబుతాడు. పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్తు, ఒక దుర్భేద్యమైన గృహంలో ఉండిపోతాడు.

ఏడవరోజు పాములు మానవరూపంలో వచ్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇస్తారు. అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు.

రావణుని జయించిన మాంధాత

యవనాశ్వుని కుమారుడు మాంధాత. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్ర జలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. 12 వ ఏటనే రాజ్యాభిషిక్తుడైన మాంధాత ఎంతో బలవంతుడని తెలుసుకున్న రావణుడు అతనితో యుద్ధం చేయడానికి వచ్చి, ఆ యుద్ధంలో ఓడిపోతాడు. బ్రహ్మ, ఇంద్రుడు వచ్చి మంధాతకు, రావణునికీ సంధి చేయడంతో రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు. ఇతనికి ముచికుందుడు మొదలైన అనేకమంది కుమారులున్నారు.

కృపుడు

శరద్వంతుని కుమారుడు కృపుడు. అతని చెల్లెలు కృపి. శరద్వంతుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో జన్మించిన వీరిద్దరినీ శంతనుడు చేరదీసి పెంచుతాడు. తపస్సు పూర్తయిన శరద్వంతుడు కృపుడికి ధనుర్విద్య నేర్పిస్తాడు. కృపికి ద్రోణాచార్యునితో వివాహం చేస్తాడు. సాత్విక స్వభావం కలిగిన కృపుడు ద్రోణాచార్యునీతో బాటు దుర్యోధనుని కొలువులో ఆచార్యునిగా ఉన్నాడు. ఎన్నడూ దుర్యోధనునికి ఎదురుచెప్పక అతడికి అనువర్తనగా ఉండేవాడు. అయితే మరీ అత్యవసర సమయాలలో మాత్రం హితవచనాలు చెప్పేవాడు. ధనుర్విద్యలో నిపుణుడు అయినప్పటికీ భీష్ముడు, ద్రోణుడు వంటివారి వల్ల ఇతని శౌర్యం పూర్తి స్థాయిలో బయటపడవలసిన అవసరం ఎన్నడూ కలగలేదు.

సగర పుత్రులను భస్మం చేసిన కపిలుడు
భగీరథుని పేరు మనకు తెలుసు. గంగను భూమి మీదకు రప్పించడానికి అతడు చేసిన ప్రయత్నాలకు భగీరథ ప్రయత్నాలని పేరు. ఈ భగీరథ ప్రయత్నానికి పరోక్షంగా కారకుడు కపిలుడు. సగరుడనే రాజు అశ్వమేధ యాగం చేయగా, ఆ యాగాశ్వం పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిలుని వద్దకు పోతుంది. యాగాశ్వము వెంట వెళ్ళిన సగరపుత్రుల అలికిడికి కపిలుడు కోపంగా కళ్ళు తెరిచి చూడగా, సగరపుత్రులందరూ భస్మమైపోతారు. మరణించిన సగరపుత్రులు పుణ్యలోకాలకు చేరాలంటే ఈ భస్మంపై గంగ ప్రవహించాలనే కపిలుని సూచన మేరకు దిలీపుని కుమారుడైన భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి గంగను భూమి మీదకు తీసుకువస్తాడు.

జనమేజయుడు

వైశంపాయనుడు, భారత కథను జనమేజయునికి వినిపించాడు. అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి పాముకాటు వల్ల మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. సర్పయాగం చేస్తున్న సమయంలో పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి కాలిపోతుంటాయి. అలా సర్పజాతిని నిర్మూలించాలనుకుంటాడు జనమేజయుడు. అయితే సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరతారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు.

బభ్రువాహనుడు

అర్జునుడికి, చిత్రాంగదకు జన్మించిన కుమారుడు బభ్రువాహనుడు. ఇతను పుట్టిన తర్వాత తల్లి దగ్గరే పెరగడంతో అర్జునుడిని ఎన్నడూ చూడలేదు. బభ్రువాహనుడు పెరిగి పెద్దవాడయ్యే కాలానికి ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తాడు. యాగాశ్వం వెంట అర్జునుడు రాగా, అతడిని బభ్రువాహనుడు నిలువరిస్తాడు. అర్జునుడికి, బభ్రువాహనుడికి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడు మరణించగా, పినతల్లి ఉలూచి సలహాతో బభ్రువాహనుడు నాగలోకం వెళ్ళి సంజీవని మణి తీసుకొచ్చి, అర్జునుని పునర్జీవితుడిని చేస్తాడు. అయితే అర్జునుడిని బభ్రువాహనుడు పునర్జీవితుడిని చేసే విషయంలో ఇతర కధనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

అనూరుడు

రామాయణంలో సంపాతి, జటాయువు అనే పక్షుల పేర్లు కనిపిస్తాయి. రావణాసురుడు సీతని ఎత్తుకుపోయిన తర్వాత ఆమె జాడ గురించి వానరులకు చెప్పింది జటాయువే. ఈ సంపాతి, జటాయువుల తండ్రి అనూరుడు. ఇతను వినత, కశ్యపుల కుమారుడు. కద్రువకు పిల్లలు పుట్టినను తనకు పుట్టకపోవడంతో అండముల విచ్చిన్నం చేసుకుంటుంది వినతి. విచ్చిన్నమైన అండం భాగం నుంచి ఒక శిశువు జన్మిస్తాడు. అతడే అనూరుడు. సగం దేహంతో జన్మించిన అతడు రెండవ అండంలోని మిగిలిన భాగం జన్మించేవరకు దానిని తాకవద్దని, ఆ అండాన్ని విచ్చిన్నం చేసినందుకు కద్రువకు దాసిగా ఉండమని శపిస్తాడు. ఇతని భార్యే శ్యేని.

అనిరుద్ధుడు

కృష్ణునికి అనిరుద్ధుడు మనుమడు. ప్రద్యుమ్నుని కుమారుడితడు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుల కథలు ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి. అనిరుద్ధుడు మొదట రుక్మి మనుమరాలైన రుక్మిలోచనను వివాహమాడతాడు. బాణాసురుని కుమార్తె అయిన ఉష అనిరుద్ధుని రూపాన్ని కలలో చూసి, అతడిని వరిస్తుంది. ఉష చెలికత్తె అనిరుద్ధుడిని మాయా విద్యతో ఉష వద్దకు చేరుస్తుంది. వారికి వజ్రుడనే కుమారుడు జన్మిస్తాడు. అంతఃపురంలోకి ఇతరులు ప్రవేశించాలని తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. అనిరుద్ధుడి విషయం తెలుసుకున్న ప్రద్యుమ్నుడు, సాత్యకి కృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేసి, అతనిని ఓడించి అనిరుద్ధుడికీ ఉషకు వివాహం చేస్తారు. ప్రద్యుమ్నుడి కథలో అయితే ప్రద్యుమ్నుడు తన గత జన్మలో మన్మధుడు. శంబరాసురుని కుమార్తె మాయావతి. వీరు కూడా వివాహమాడతారు.

ఆహుకుడు

నలుడు పూర్వజన్మలో ఆహుకుడనే భిల్లుడిగా జన్మించాడు. అతడు శివభక్తుడు. అతని భక్తిని పరీక్షించేందుకు శివుడు ఒక ముని రూపంలో అతని వద్దకు వచ్చి, అతని ఇంట్లో తనకు ఆశ్రయమివ్వమని కోరాడు. ఆహుకుడికి, అతని భార్యకు ఉన్న చోటు అతి తక్కువ కావడంతో మునికి, తన భార్యకు ఇంట్లో చోటిచ్చి, తను ఆరుబయట నిద్రించాడు. ఆ సమయంలో ఒక పులి అతడిని చంపేస్తుంది. అతని భార్య సహగమనం చేయబోగా, ఆ ముని ఏదైనా కోరుకోమని ఆహుకుడి భార్యకు చెప్పగా, ఆమె “మీకు తోచింది ఇవ్వ’’మంది. అప్పుడు శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై, వచ్చే జన్మలో మీరు నలదమయంతులుగా పుడతారని, వారిమధ్య వియోగం వచ్చినప్పుడు తాను హంస రూపంలో వారిద్దరినీ కలుపుతానని వరమిస్తాడు. ఆ వరప్రభావంతో ఆహుకుడే నలుడిగా జన్మించాడు. అతని భార్య దమయంతిగా పుట్టింది.

తారకాసురుడు

వజ్రాంగుడనే రాక్షసుని కుమారుడు తారకాసురుడు. బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేసిన తారకాసురుడు సృష్టిలో తనకు సమానమైన బలం కలిగిన వీరుడు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు విజ్రుంభించి అన్ని లోకాల వారినీ బాధించడం మొదలుపెట్టాడు. చివరికి శివుని కుమారుడే తారకాసురుడిని వధించగలడని బ్రహ్మ చెబుతాడు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధంలో అతడిని సంహరిస్తాడు.

No comments: