
‘భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే...’
ఓ మూఢమతీ! గోవిందుడి భజనచెయ్యి. మరణకాలం ఆసన్నమైనప్పుడు నీవు నేర్చిన పాండిత్యం, వ్యాకరణం నిన్ను రక్షించలేవు. మనకు లభించిన కాలాన్ని విద్య, వృత్తి, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో ధనార్జనలో మునిగిపోవడం పునర్జన్మలకు దారితీస్తుంది. రోజూ కొంత సమయాన్ని అయినా దేవుణ్ని ధ్యానించు. హరి నామస్మరణే ముక్తికి సోపానం.
విద్య- పరవిద్య, అపరావిద్య అని రెండు రకాలు. పరోపకారానికి వినియోగించే విద్యలు అపరావిద్యలు. కేవలం మన ఉదరపోషణకు, మన సుఖాలకోసం నేర్చే విద్య పరవిద్య. మనిషి ఎంత ఎక్కువ కర్మరాశితో ఈ నేలమీద అడుగుపెడతాడో, తిరిగి పోయేటప్పుడు అంతకు తక్కువ కర్మరాశితో వెళ్లగలిగితే అతడే అసలైన జ్ఞాని.
కలియుగంలో నామస్మరణకన్నా ముక్తి పొందేందుకు తరణోపాయం లేదు. శివనామమనే నావ దొరికితే సంసార సాగరాన్ని అవలీలగా దాటగలం. దేహపోషణకు అవసరమైన మేరకే ధనార్జన చేయాలి. భక్తి జ్ఞాన, ధ్యానయోగంలో గడపటం వివేకవంతుడి లక్షణం. ఎంత ధనం సంపాదించినా తృప్తి ఉండదు. ధన సంపాదనతో భోగాలు అనుభవించినకొద్దీ పాపం, దుఃఖం పెరుగుతూనే ఉంటాయి. మనిషికి దేవుణ్ని దూరం చేసేవి ప్రధానంగా కాంతాకనకాలు. వాటి ప్రలోభాలకు లోనుకావడమంటే నరకాన్ని కోరితెచ్చుకోవడమే. చర్మప్రీతి కలవాడు చెడిపోవడం తథ్యం. పవిత్రత, మనోనిగ్రహం అద్వైతసిద్ధికి దగ్గరిదారులు.
తామరాకుమీది నీటిబొట్టు ఎలా చంచలమై ముత్యంలా మెరుస్తుంటుందో మన జీవితం కూడా అలా చంచలమై అశాశ్వతమైన మనను భ్రమలో పడేస్తుంటుంది. తన మరణం ‘ఇప్పుడే, ఇక్కడే’ అని మనిషి భావించడు. ఎప్పుడో భవిష్యత్తులో జరిగేదన్న భ్రాంతిలో పడటం మరీ విడ్డూరం. డబ్బు ఉన్నంతకాలం అంతా ప్రేమ ఒలకపోస్తారు. డబ్బుపోయాక, యౌవనం ఉడిగాక, వార్ధక్యంవల్ల శరీరం ముడతలు పడ్డాక పలకరించేవారే ఉండరు. బాల్యమంతా ఆటలతో, యౌవనాన్ని స్త్రీ వ్యామోహంతో, వృద్ధాప్యాన్ని అనారోగ్యచింతతో గడిపేస్తారుగాని పరబ్రహ్మం గురించి ఎవరూ ధ్యానించరు.
సజ్జన సాంగత్యంవల్ల అజ్ఞానానికి కారణమైన మోహం నశిస్తుంది. పరిశుద్ధ బుద్ధివల్ల బతికుండగానే ముక్తి లభిస్తుంది. సాధుజన ప్రవచనం వినడంతో ప్రతి క్షణం అమృతతుల్యమవుతుంది. మానవజన్మ, ముక్తి పొందాలన్న కోరిక, మహాపురుషుల దర్శనం దైవానుగ్రహంవల్లే లభిస్తాయి. నీరు ఎండిపోతే చెరువు, చెరువనిపించుకోదు. అలాగే వయసు మళ్లాక కామవికారం అదృశ్యమైపోతుంది.
వివేక, వైరాగ్యాలనే ఖడ్గాలతో ఆశ అనే విషవృక్షాన్ని సమూలంగా నరికివేస్తే, తప్ప, మనిషి ముముక్షువు కాలేడు. మనిషికి ఆధ్యాత్మికానందాన్ని మించింది మరొకటి లేదు. వైరాగ్యం వంటి ధనం, బ్రహ్మబోధకు సమానమైన సుఖం, సద్గురువును మించిన రక్షకుడు, సంసారంలాంటి శత్రువు లోకంలో లేరు. భగవద్గీత చదివి, గంగనీరు తాగి, మురారిని పూజించే వాడివైపు యముడు కన్నెత్తి చూడడు. మళ్ళీమళ్ళీ పుట్టడం, మళ్ళీమళ్ళీ గిట్టడం, ఇలా సంసారందాట శక్యంకానిది. కాపాడేవాడు పరమాత్మ ఒక్కడే. పరిపూర్ణ యోగి మాత్రమే ఈ లోకంలో పరమానందం పొందగలడు. అందరిలోనూ ఉన్నది ఆ విష్ణువే. అందరిపట్ల సమత్వం పాటించు. భేదబుద్ధిని కలిగించే అజ్ఞానాన్ని తరిమికొట్టు. ఆత్మజ్ఞానంలేని మూఢులు నరకబాధలను అనుభవిస్తారు. ప్రాణాయామం చెయ్యాలి. ధ్యానం, ఏకాగ్రతతో జపసాధనం చెయ్యి. సద్గురువును సేవించు. దేవుడు మనల్ని తన బందీగా చేసిన మరుక్షణం నుంచీ మనకు అసలైన స్వేచ్ఛ, ముక్తి లభిస్తుంది.
మన శరీరంలోనే జ్ఞానం అనే రత్నాన్ని దొంగిలించడానికి, కామక్రోధలోభాలనే దొంగలు పొంచి ఉన్నారు. అందువల్ల... జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
No comments:
Post a Comment