Translate

Thursday, March 21, 2019

హోలీ పండగ (సేకరణ- ఈనాడు పేపర్ నుండి)





హోలీ... రంగుల పండగ... ఉగాదికి కాస్తముందు... వసంతం ఆగమించిన శుభవేళ...  రకరకాల వర్ణాలను వెదజల్లుకుంటూ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ... అంతేనా... ఈ పండగ మనిషిలోని వికారాలను దూరం చేసుకోమంటుంది... కల్మషాలను కడిగేయమంటుంది... అంతరంగాన్ని వర్ణశోభితం చేసుకోమంటుంది.. ఈ అద్భుతమైన పర్వదినానికి నేపథ్యంగా వివరించే కథలు అదే విషయాన్ని చెబుతాయి...

ఏవిధమైన రంగులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. మన ఆలోచనలు స్పష్టంగా ఉండాలన్నా, దానికి అనుగుణంగా బుద్ధి ప్రతిస్పందన కలిగి మనం ఒక పని చేయాలన్నా అందుకు కారకంగా నిలిచేవి రంగులు. దూరంగా కనిపించే మంటల్లోని ఎర్రటిరంగు అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అంచనా కలిగిస్తుంది. అందుకు అనుగుణంగా మనసు ప్రతిస్పందిస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్న పూలగుత్తులు... వాలుతున్న మొక్కలు మనసును తేలికపరుస్తాయి. మోడుగా మిగిలిన చెట్టును చూడగానే విషాదభావన కలుగుతుంది. ఇలా... ఏ అంశాన్ని చూసినా మనకు మరుక్షణంలోనే ఓ మనస్థితి కలుగుతుంది. నిజానికి ఆ సన్నివేశం కన్నా, దాన్ని ప్రకటించిన రంగు మన మనస్సు మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఆ రంగువల్లే ఆ సంఘటన తీవ్రత మనకు అర్థమవుతుంది.


* దుర్గాదేవి పసుపు వర్ణంతో ప్రకాశిస్తుంది. కాళికాదేవి ముదురు నీలం రంగులో ఉంటుంది. సరస్వతీదేవి తెల్లని వర్ణంతో స్వచ్ఛమైన ముత్యపురంగులో ప్రకాశిస్తుంది. ఇలా.. ఒక్కో దేవతను స్మరించుకోగానే ఒక్కోరంగు మనసులో ప్రత్యక్షమవుతుంది. దేవుడు లేదా దేవతను ఆ రంగులోనే మనం భావన చేస్తాం. మరో రంగులో ఆ దేవతను పోల్చుకోలేం. ఆకాశపు రంగు నీలం. ఆకాశానికి విశ్వమంతటా వ్యాపించి ఉండే లక్షణం ఉంది. దూరం నుంచి చూస్తే సముద్రం కూడా నీలం రంగులో కనిపిస్తుంది. సముద్రం అనంతం అనే భావనకు ప్రతీక. ఇలా సర్వవ్యాపక లక్షణాలు కలిగిన నీలపురంగులో రాముడు ఉన్నాడు. రామ, కృష్ణులిద్దరూ మహావిష్ణు అవతారాలు. వారిద్దరిలోని సర్వవ్యాపకత్వాన్ని నీలం రంగు వ్యక్తం చేస్తుంది.  ఇలాగే దేవతలందరూ. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో రంగు సంబంధించి ఉంటుంది. ఆ రంగులన్నీ ఆయా దేవతల స్వభావాన్ని ప్రకటిస్తాయి. జగన్మాత స్వరూపాలూ అంతే...

అన్నపూర్ణాదేవి - ఎరుపు
లక్ష్మీదేవి - బంగారు 
సరస్వతి - తెలుపు
కాళి - ముదురు నీలం
దుర్గాదేవి - పసుపు
మహిషాసురమర్ధని - ఎరుపు
రాజరాజేశ్వరీదేవి - పసుపు
బగళాముఖి - బంగారు 
శాకంబరి - మిశ్రమ  వర్ణం


* మనిషి నడవడిక, ఆలోచన, వ్యవహారం, దైనందిన జీవితం, భవిష్యత్తు అన్నీ ఆయా గ్రహాల సంచారం మీదే ఆధారపడి ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అందుకే, నవగ్రహాల ఆరాధన, జపం, దానాలు తప్పనిసరిగా చెయ్యాలని సూచిస్తుంది. వీటితోపాటు ప్రత్యేకంగా ఆయా గ్రహాలకు ప్రతీకలుగా కొన్ని రంగుల్ని కూడా పేర్కొంది.  పూజా సమయంలో ఏ గ్రహానికి అర్చన చేస్తున్నామో దానికి సంబంధించిన రంగు వస్త్రాన్ని ధరించాలని పండితులు చెబుతారు. దీనివల్ల ఆ గ్రహాధిదేవతకు తృప్తి కలుగుతుంది. ఆయా గ్రహాలకు సంబంధించిన రంగుల్లో ఉండే ముత్యం, వజ్రం, కెంపు, పగడం వంటి రత్నాలను ఉంగరాల్లో ధరించాలని కూడా జ్యోతిష్కులు చెబుతారు. ఇవన్నీ ఆయా రంగులతో ముడిపడి ఉన్న భావనల్ని ఆ వ్యక్తి మనసుల్లో తీవ్రతరం చెయ్యటం లేదా మందగింపజేయటం కోసం ఉద్దేశించినవే.

సూర్యుడు - ఎరుపు
చంద్రుడు - తెలుపు 
కుజుడు - ఎరుపు
బుధుడు - ఆకుపచ్చ 
గురుడు - పసుపు 
శుక్రుడు - తెలుపు
శని - నలుపు 
రాహువు - తేనెరంగులో ఉండే నలుపు 
కేతువు - చిత్రవర్ణం


* ‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః’ - నిరంతరం మననం చెయ్యటం వల్ల మనల్ని రక్షించేది మంత్రం అని అర్థం. నిరంతరం మననం అంటే త్రికరణశుద్ధిగా ఒక పని మీద లక్ష్యాన్ని ఏర్పరచుకుని సాధన చెయ్యటమే అవుతుంది. అటువంటి సాధనకు మనస్సు చాలా ముఖ్యం. ఆ సమయంలో కంటితో చూసే దృశ్యం , ధరించిన వస్త్రాల రంగులు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. ఏ కోరికతో అయితే మంత్రాన్ని జపిస్తున్నామో ఆ కోరికను మరింతగా ఉద్దీపనం చేస్తాయి.  మంత్రోపాసనలో రంగువస్త్రాలను నిర్దేశించటంలో అంతరార్థం ఇదే. వారాహి, ధూమావతి, దక్షిణకాళి మొదలైన మంత్రాలను ఉపాసన చేసే సందర్భంలో కూడా కొన్ని రంగుల వస్త్రాలు ధరించాలని తంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.

అందుకే ఆ శిక్ష...
ధర్మార్ధకామమోక్షాలను చతుర్విధ పురుషార్థాలంటారు. ఇవన్నీ మానవుడు సాధించాల్సినవి. ఇందులో కామం కూడా ఒకటి. మరోవైపు కామక్రోధమోహలోభమదమాత్సర్యాలను అరిషడ్వర్గాలుగా చెప్పారు. అంటే శత్రుకూటమి అని అర్థం. ఈ కూటమికి నాయకత్వం వహించేది కూడా కామమే. మరోవైపు తన విభూతుల్లో ఒకటిగా కామాన్ని పేర్కొన్నాడు భగవానుడు. మరి కామంపై అభిప్రాయాల్లో ఎందుకింత విభిన్నత అంటే... ఇక్కడ మనం ధర్మకామాన్ని గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ధర్మాన్ని అనుసరించిన కామం ఎప్పుడూ వాంఛింపదగింది. అదే అధర్మంతో కలిస్తే అది మనిషి పాలిట శత్రువవుతుంది. కాబట్టి అలాంటి కామాన్ని విసర్జించమంటాయి ధర్మశాస్త్రాలు. మనకు కుమారసంభవంలో కనిపించేది కూడా అదే.పార్వతీదేవిని వివాహం చేసుకోవాలనే కోరికను శివుడికి కల్పించాలనే లక్ష్యంతో మన్మథుడు శివుడిపై తన బాణాలు ప్రయోగిస్తాడు. దీంతో ఆగ్రహించిన శివుడు తన మూడోకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. తన భర్త మరణానికి దుఃఖిస్తూ మన్మథుడి భార్య రతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది. కరుణించిన శివుడు అతణ్ణి బతికించి, కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చి, ఆమెలో వసంతాన్నిచిగురింపజేస్తాడు. తీవ్ర తపస్సులో మునిగి ఉన్న శివుడిపైకి మన్మథబాణాలు అవాంఛనీయాలు. ఆయన మనస్సుపై జరిగిన దాడి అది. అందుకే పరమేశ్వరుడు కామానికి ప్రతీక అయిన మన్మథుడిని తన చూపుల వేడితో భస్మం చేస్తాడు. అదే సమయంలో పునరుత్పత్తికి, తద్వారా సృష్టికి కారణమై లోకానికి అత్యంత ఆవశ్యకమైన అతడిని కరుణించి కాపాడాడు. మన్మధుడికే కాముడనే పేరు ఉంది. కాముడు దహనమైన రోజు కాబట్టి ఈ రోజుకు ‘కామదహనం’ అనే పేరు వ్యాప్తిలోకి వచ్చింది. ఆరోజునే హోలీ చేసుకుంటారని చెబుతారు. ఇక్కడ ధర్మకామం అనుసరణే హోలీ సందేశం.

ఆ అయిదు బాణాలు...
మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. ఆయన మహావిష్ణువుకు మానస పుత్రుడు. చెరుకు గడను విల్లుగా ఉపయోగిస్తాడు. అరవిందం (తామర పువ్వు), అశోకం (అశోక వృక్షం పువ్వు), చూతం (మామిడి పువ్వు), నవమల్లిక (అప్పుడే విరిసిన మల్లెపువ్వు), నీలోత్పలం (నల్ల కలువ) అనే అయిదు పుష్పాలు ఆయన వాడే బాణాలు.

ఆయనను మర్చిపోయావా?
భక్తి అనే అగ్నిలో లౌకిక సుఖభోగాలనే అవివేకాన్ని దగ్ధం చెయ్యటానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందన సందేశాన్నిస్తూ ఓ వృత్తాంతం వ్యాప్తిలో ఉంది. ఉజ్జయినీ నగరంలో నివసించే వసంతిక అప్సరసలను మించిన సౌందర్యవతి.  యుక్తవయస్సు రాగానే ఆమెతో పోటీపడే అందగాడైన వరుడితో వివాహం జరిపిస్తారు తల్లిదండ్రులు. మితిమీరిన సౌందర్యగర్వంతో భర్తతో సుఖభోగాలను అనుభవిస్తూ, వంశపారంపర్యంగా వచ్చే శివపూజను విస్మరిస్తుంది వసంతిక. తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెడుతుంది. పరమేశ్వరుడే ఆమెకు కనువిప్పు కలిగించాలని ప్రార్థిస్తారు తల్లిదండ్రులు. వసంతికకు జ్ఞానోదయం కలిగించటానికి పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమె ఇంటికి వస్తారు. తాను ఊరువెళ్తున్నానని, తిరిగి వచ్చేవరకు వృద్ధుడైన తన భర్తను జాగ్రత్తచూడమని వసంతికను అడుగుతుంది వృద్ధురాలు. సరేనంటుంది వసంతిక. కానీ, తన దైనందిన సుఖభోగాల విషయంలో పడి వృద్ధుడి సంగతి మర్చిపోతుంది. సరిగ్గా వృద్ధురాలు వచ్చేసరికి మాయా వృద్ధుడు మరణిస్తాడు. సుఖభోగాల్లో తేలుతూ తన భర్తను పట్టించుకోకపోవటం వల్లే అతడు మరణించాడని, ఇందుకు వసంతికే బాధ్యత తీసుకోవాలంటుంది వృద్ధురాలు. తన వల్లే పొరపాటు జరిగిందని అంగీకరించి, జరిగిన దానికి చింతిస్తూ చితిని పేర్చుకుని అôదులో దహనమయ్యేందుకు సిద్ధపడుతుంది వసంతిక. ఆమెలో వచ్చిన మార్పును గమనించిన పార్వతీపరమేశ్వరులు నిజరూపంతో సాక్షాత్కరించి, ఆమె పేర్చుకున్న చితిని పూలపాన్పుగా మారుస్తారు. సుఖభోగాలు అనుభవించాల్సినవే కానీ ఆ మాయలోపడి దైవపూజను విస్మరించటం తగదని, క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన దైవపథాన్ని వదులుకోవటం అవివేకమని వసంతికకు హితబోధ చేస్తారు ఆది దంపతులు. తన తప్పును మన్నించమని ప్రార్థించిన వసంతికను ఆశీర్వదించి, వారు అంతర్థానమవుతారు.

ఎక్కడున్నా తప్పించుకోలేదు...
హోలిక అనే రాక్షసి దహనమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని హేమాద్రికాండ, భవిష్యత్‌ పురాణం, ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి. వీటి ప్రకారం హిరణ్యకశిపుడి సోదరి హోలిక. కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పరాయణుడు కావటంతో ఆగ్రహించి, అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా ఉంటాడు. చివరకు హిరణ్యకశిపుడు ఓ ఉపాయం ఆలోచిస్తాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల అతని సోదరి హోలికకు ఓ పైవస్త్రం లభిస్తుంది. ఎంతటి భయంకరమైన అగ్ని అయినా వస్త్రం ధరించిన వారిని ఏమీ చెయ్యదు. హోలికను ఆ వస్త్రాన్ని ధరించమని చెప్పి, ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి, తన భటుల చేత నిప్పు అంటింపజేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ చేత హోలిక కప్పుకున్న ఆ వస్త్రం గాలికి ఎగిరిపోయి, ఆమె దగ్ధమవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈవిధంగా హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు. దైవభక్తిముందు ఎటువంటి మాయోపాయాలు పనిచెయ్యవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని ఈ వృత్తాంతం అందిస్తుంది.

- కె.రామకృష్ణ

No comments: