నిరంతరం సత్యాన్వేషణ జరుపుతూ, అనుక్షణం విద్య గరుపుతున్న నిత్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన బ్లాగ్ ఇది. ఇందులో నా ఆలోచనలు, భావాలతో పాటు, వివిధ రకాల ఉపయుక్త సమాచారాన్ని పొందుపరుస్తాను, మీ సూచనలు, సలాహాలు సదా అభిలషణీయం. - డా. వేణు మాధవ శర్మ This blog is for the eternal seeker, always striving to learn and grow. I share reflections and insights, blending devotion with wisdom, along with practical guidance for your spiritual and educational path. Dr. M. Venu Madhava Sharma
Translate
Sunday, March 3, 2019
యాదాద్రి విశేషాలు
సాకారమవుతున్న స్వప్నం... యాదాద్రి క్షేత్రం!
‘ఎందెందు వెదకి జూచిన అందందే గలడు’ అని అపారమైన విశ్వాసంతో చెప్పిన ప్రహ్లాదుడి భక్తిని అద్వితీయంగా నిరూపించి, స్తంభంలో ఆవిర్భవించి, దుష్టశిక్షణ చేసిన సర్వాంతర్యామి నరసింహస్వామి. దశావతారాల్లో విలక్షణంగా సగం మనిషి, సగం మృగం ఆకారం దాల్చిన నాలుగో అవతారం. ఆ అవతార మహిమను ఘనంగా చాటే పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. తెలుగునాట వెలసిన నృసింహాలయాల్లో విశిష్టమైన పంచ నారసింహ క్షేత్రమిది. అలనాటి పవిత్రతనూ, తరతరాల వైభవాన్నీ నిలుపుకుంటూనే అత్యాధునిక హంగులతో, నవనవోన్మేషంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయం భక్తిముక్తి ప్రదాయకం.
గుహలో దేవేరితో కొలువుదీరిన పంచనారసింహుల దివ్యరూపం... ముంగిట ఆళ్వారుల ముఖమండపాలు... నలుదిక్కులా మాడవీధులు... సప్త గోపురాలు... అంతర్ బాహ్య ప్రాకారాలు... కాకతీయుల సంప్రదాయాలను ప్రతిబింబించే కృష్ణశిలా శిల్పాల సోయగాలు... ఇలా ఒకటా రెండా, అడుగడుగునా ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతూ గుట్టమీద రూపుదిద్దుకుంటున్న ఆలయ నిర్మాణాలు నాటి యాదగిరి గుట్టను నేటి ఆలయ నగరిగా రేపటి ఆధ్యాత్మిక విశ్వనగరిగా నిలబెడతాయనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ బాధ్యతను తన భుజస్కందాలకు ఎత్తుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అధికారికంగా ఒక ఆలయనిర్మాణానికి పూనుకోవడం బహుశా ఇదే తొలిసారి. వైష్ణవ పీఠాధిపతి త్రిదండి చినజీయర్ స్వామి సలహాలూ సూచనలతో ఈ ఆలయం పునర్నిర్మిత మవుతుండటం విశేషం. యాదగిరి గుట్ట నుంచి యాదాద్రి వరకూ ఆ స్తంభోద్భవుడి సన్నిధిలో రూపుదిద్దుకుంటున్న విశేషాల సమాహారం...
నాలుగో అవతారం
రాక్షసుల రాజు హిరణ్య కశిపుడు. వైష్ణవద్వేషి. పరమ కిరాతకుడు. ఇది చాలదన్నట్లు విధాత నుంచి అభేద్యమైన వరాన్ని పొందుతాడు. ఆ వరం కారణంగా పంచభూతాలవల్ల కానీ మనుషుల వల్ల కానీ జంతువుల వల్లకానీ ఆయుధాలవల్ల కానీ ఇంట్లో కానీ బయట కానీ పగటివేళ కానీ రాత్రిపూట కానీ తనకు మరణంరాదు కాబట్టి మృత్యుంజయుణ్నని విర్రవీగేవాడు. లోకకంటకుడిగా మారి హరినామం ఆలపించినవారిని ఉచ్ఛంనీచం మరిచి ఉసురుతీసేవాడు. దేవతలకు బద్ధశత్రువుగా నిలిచి, వారిని ప్రాణభయంతో పరుగులుపెట్టించాడు.
హిరణ్య కశిపుడి బిడ్డడు ప్రహ్లాదుడు... అమ్మ కడుపులోనే ‘ఓం నమో నారాయణాయః’ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆపోశన పట్టిన విష్ణుభక్తుడు. గురువు శిక్షించినా తండ్రి చంపాలని చూసినా... శ్రీహరే శరణని నమ్మి కొలిచిన భక్తాగ్రజుడు. కొడుకుతో విష్ణునామ స్మరణను మాన్పించాలనుకున్న హిరణ్య కశిపుడు ఓటమిపాలవుతాడు. తండ్రీకొడుకులకు మాటలయుద్ధం మొదలైంది. నీ శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పమంటూ నిలదీశాడు హిరణ్య కశిపుడు. ‘నీలోనూ నాలోనూ చివరికి ఈ స్తంభంలోనూ ఉన్నది నారాయణుడే’ నంటూ తొణకక జవాబిచ్చాడు ఆ పసివాడు. దీంతో ఆగ్రహం పట్టలేని హిరణ్య కశిపుడు గదతో స్తంభాన్ని మోదాడు. అంతే... ప్రహ్లాదుడి పిలుపుతో ప్రకటితమయ్యాడు నరసింహుడు. నరుడూ కాదు, మృగమూ కాదు. నరమృగ శరీరం. భీకర గాండ్రింపులు చేస్తున్న ఉగ్రరూపం. భీతిల్లిన హిరణ్య కశిపుడిని పగలూరాత్రీ కాని సంధ్యా సమయంలో ఆయుధం లేకుండా తన పదునైన కొనగోళ్లతో చీల్చిచెండాడాడు. లకాన్ని రక్షించాడు. తన అవతార లక్ష్యాన్ని పరిసమాప్తి చేశాడు.
రుషి పేరుమీదుగానే...
యాదగిరి గుట్టమీద వెలసిన లక్ష్మీనరసింహస్వామి ప్రశస్తికి సంబంధించి పురాణాల్లో ఎన్నో ఐతిహ్యాలున్నాయి. రామాయణ మహాభారతాల్లోనూ ఆ ప్రస్తావనలు కనిపిస్తాయి. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్య శృంగుడు. అతడి పుత్రుడు యాదరుషి. యాదరుషి చిన్నతనం నుంచీ విష్ణుభక్తుడు. అందులోనూ నృసింహావతారం అంటే ఎనలేని మక్కువ. ప్రహ్లాదుడు నింపుకున్నట్లే ఆ నరమృగ శరీరుడిని గుండెల్లో పదిలపరుచుకోవాలని ఆశ. అందుకోసం అడవిబాట పట్టాడు. దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతివారికి చిక్కాడు. వాళ్లు యాదుడిని క్షుద్రదేవతలకు బలివ్వబోయారు. అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై యాదర్షిని రక్షించి, దిశానిర్దేశం చేస్తాడు. యాదర్షి దీర్ఘకాల తపస్సు ఫలించి... నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. అయితే, ఆ ఉగ్రరూపాన్ని కళ్లతో చూడలేకపోతాడు యాదర్షి. అతడి కోరికమేరకు స్వామి
శాంత స్వరూపంలో లక్ష్మీసమేతంగా దర్శనమిస్తాడు. తనివితీరా నరసింహుడి రూపాన్ని దర్శించిన యాదర్షి వివిధ రూపాల్లో తనని అనుగ్రహించమని కోరతాడు. భక్తుల మాటజవదాటలేని భక్తవరదుడు దాంతో స్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రనరసింహ, శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా సాక్షాత్కరించి స్వయంభూగా ఉద్భవించాడు. వీటిలో... జ్వాలా నరసింహుడూ యోగానంద నరసింహుడూ లక్ష్మీనరసింహుడూ కొండగుహలో కొలువుదీరగా, గండభేరుండ స్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడితో కలిసి ఆలయానికి తూర్పున పూజలు అందుకుంటున్నాడు. ఇక ఉగ్ర నరసింహుడిది అభౌతిక రూపమంటారు. తేజో వలయంగా కొండ చుట్టూ ఆవరించి ఉన్నాడంటారు. అందుకే ఈ ఆలయాన్ని పంచనారసింహ క్షేత్రంగా అభివర్ణిస్తారు.
ఆ రుషి పేరుమీదుగానే ఈ కొండ యాదగిరి గుట్టగా, యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది.
నాటి యాదగిరి గుట్ట
తిరుపతి, సింహాచలం... లాంటి పుణ్యక్షేత్రాల్లో మాదిరిగానే యాదాద్రి లక్ష్మీనరసింహుడినీ ఎందరో రాజులు కొలిచి తరించారు. మతాలకతీతంగా మరెందరో ప్రభువులు ఆలయాన్ని అభివృద్ధిచేశారు. ముడుపులు కట్టారు మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో మొదటిగా చెప్పుకోవలసినవాడు పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లుడు. ఇతడు క్రీ.శ. 1148 సంవత్సరంలోనే యాదాద్రీశుడిని దర్శించుకున్నట్లు భువనగిరి దుర్గంలోని శాసనాలద్వారా తెలుస్తోంది. కాకతీయ గణపతిదేవుడూ, తర్వాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలూ స్వామిని అర్చించి తరించినవారే. ఆ రోజుల్లో యాదాద్రి కీకారణ్యంగా ఉండేది. ఒంటరి ప్రయాణం మాట దేవుడెరుగు, చీకటి పడిందంటే గుంపులు గుంపులుగా వెళ్లిన భక్తబృందాలు సైతం దారికానరాక నానా ఇబ్బందులూ పడేవి. వీటిని గమనించిన నిజాం ప్రభువులు కొండమీదకు మార్గాన్ని నిర్మించారు.
ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో భక్తులు యాదాద్రికి తరలివచ్చి స్వామిని అర్చించడం ప్రారంభించారు. ఇక్కడి పుష్కరిణి చాలా విశేషమైందంటారు. సాక్షాత్తూ ఆ దేవదేవుడి పాదాల నుంచీ గంగ ఉద్భవించిందనీ, ఇందులో స్నానమాచరిస్తే సకలపాపాలూ తొలగిపోతాయనీ ఆరోగ్యం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. బ్రాహ్మీ ముహూర్తంలో మహర్షులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి... వేదమంత్రాలు జపిస్తూ... లక్ష్మీనరసింహుడి దర్శనానికి బయలుదేరుతారని ఓ నమ్మకం.
ఆ సమయంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయంటారు.
నేటి యాదాద్రి...
కాకతీయుల అనంతరం ఇంత భారీఎత్తున శిల్పనిర్మాణాన్ని చేపట్టడం ఇదే తొలిసారంటున్నారు ఆలయ స్తపతులు. ఇదివరకు యాదాద్రికి వెళితే స్వయంభువుగా వెలసిన ఆసన (కూర్చున్న) నారసింహుడే దర్శనమిచ్చేవాడు. ఇకమీద స్థానక (నిల్చున్న), శయన (పవళించిన) నారసింహుడి విగ్రహాలనూ యాదాద్రిలో మనం చూడొచ్చు. కృష్ణశిలలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహాల్లో శయన నారసింహుడు పూర్తిగా మానవ ముఖ రూపంతో శ్రీరంగనాథుడి విగ్రహాన్ని పోలి ఉండటం గమనార్హం. విష్ణు భక్తుల్లో ఆళ్వారులది ఎప్పుడూ అగ్రపీఠమే. ఈ విషయాన్ని ప్రతిబింబించేలా లక్ష్మీనరసింహుడు కొలువైన ప్రధానాలయానికి ఎదురుగా స్వామి సన్నిధిలోనే దేశంలో మరెక్కడా లేని విధంగా పన్నెండు మంది ఆళ్వారుల శిల్పాలు దర్శనమివ్వబోతున్నాయి. పన్నెండు అడుగుల ఎత్తుండే ఆళ్వారుల రాతి ప్రతిమలమీద మరో పన్నెండు అడుగుల
ఎత్తు ఉండే స్తంభాలనూ వాటి మీద కాకతీయుల శిల్పసౌందర్యాన్నీ పొందుపరుస్తున్నారు. ఇక స్వామివారి నిలయమైన విమాన గోపురాన్ని సువర్ణగిరిగా తీర్చిదిద్దుతున్నారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి నూటెనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయనున్నారు. ఇలా - నింగీనేలా అంతటా భక్తి భావనను ఇనుమడింపచేసేలా సుమారు రెండున్నర ఎకరాల్లో నారసింహుడి దివ్యక్షేత్రాన్ని పునర్నిర్మిస్తున్నారు. శివకేశవులకు అభేదాన్ని చాటిచెబుతూ ఆ శిఖరంమీదే శివాలయాన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. క్యూకాంప్లెక్సులను సువిశాలంగా నిర్మిస్తున్నారు. యాదాద్రిమీద నిరంతరం గోవిందనామ స్మరణ మారుమోగేలా, యజ్ఞవాటికల్లో అనునిత్యం వేదపారాయణం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతంగా రూపొందించేందుకు సుమారు వెయ్యి ఎకరాల్లో ఈ ఆలయ నగరిని నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదాన్నీ అందించేందుకు పాతగుట్ట-యాదగిరి గుట్టల మధ్య స్థలాన్ని సువిశాల రహదారులతో పచ్చని ఉద్యానవనాలతో తీర్చిదిద్దుతున్నారు.
శిలలతోనే నిర్మాణం కొండను పిండి చేయడం వేరు... దానిమీది బండలను అందమైన శిల్పాలుగా అచ్చెరువొందే కళారూపాలుగా మలచడం వేరు. మొదటిదానికి యంత్రబలం ఉంటే సరిపోతుంది. రెండోదానికి మాత్రం సృజనకావాలి... నిష్ణాతులైనవారి దిశానిర్దేశం కావాలి... మరెంతో సహనం కావాలి. అందుకే రాజుల పాలన అంతరించిన తర్వాత మొత్తం శిలలతోనే ఆలయాలను నిర్మించే పద్ధతీ కనుమరుగైపోయింది. మళ్లీ ఇప్పుడు అంటే దాదాపు వెయ్యేళ్ల తర్వాత కేవలం శిలలతోనే రూపుదిద్దుకుంటోంది యాదాద్రి ఆలయం. అధిష్ఠానం నుంచి విమాన శిఖరం వరకూ తంజావూరు శిల్ప నిర్మాణ రీతిలో రాతితోనే నిర్మాణాలు చేపట్టడం విశేషం. దీనికోసం ప్రకాశం జిల్లాలో దొరికే కృష్ణశిలను ఎంపిక చేశారు. ఒక పొడవైన శిలను తీసుకుని దాన్ని స్తపతుల సూచనలతో దేవతారూపాలూ పువ్వులూ లతలతో అందమైన శిల్పంగా మారుస్తారు. అలా మార్చిన రాతి స్తంభాలను ఒకదానిమీద మరొకటి అమరుస్తూ ఆలయ ప్రాకారాలనూ, మాడ వీధులనూ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో రాతి స్తంభాల మధ్య ఖాళీలను పూరించేందుకు నాటి రాజుల కాలంలో ఉపయోగించిన లైమ్ మోర్టార్‌నే ఉపయోగిస్తున్నారు - అంటే - దీనికోసం బెల్లం, కరక్కాయ, టెంకాయ పీచు మొదలైన వాటితో తయారుచేసిన పదార్థాన్ని వాడతారు. ఇలా శిలలతో నిర్మాణం చేపట్టడం వల్ల మరో రెండు వేల సంవత్సరాల వరకూ ఈ ఆలయం చెక్కుచెదరకుండా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. స్వామివారిని దర్శించుకునేందుకు సప్తగోపుర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే శతాబ్దాలనాటి ప్రాచీన ఆలయంలోకి అడుగుపెట్టామన్న అనుభూతి కలుగుతుంది. ఎటుచూసినా రాతి స్తంభాలూ వాటిమీద అందంగా చెక్కిన శిల్పకళారీతులూ, జీవం ఉట్టిపడుతున్న దేవతా మూర్తుల రూపాలూ యాత్రికులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయనడంలో సందేహంలేదు. ఆగమ, వాస్తు, శిల్ప శాస్త్రాల ప్రకారం గోపురాలమీద శిల్పాలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రవేశద్వారాలకు ఇరువైపులా కనువిందుచేసే జయవిజయుల విగ్రహాలూ ఆలయ ప్రాంగణంలోని విష్ణుమూర్తి దశావతారాలూ లక్ష్మీదేవితో కొలువుదీరిన ఇతర శక్తి రూపాలూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇదే కోవకుచెందిన మరో అద్భుత కట్టడం... మెట్లమార్గంలోని వైకుంఠ ద్వార గాలిగోపురం. యాభై అయిదు అడుగుల ఎత్తులో, అయిదంతస్తుల్లో దీన్ని నిర్మించనున్నారు.
ఆలయనగరి
ప్రపంచం నలుమూలల నుంచీ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం సుమారు వెయ్యి ఎకరాల్లో ఆలయనగరిని తీర్చిదిద్దే పనిలో ఉంది. వీటిలో 250 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో కాటేజీలూ, విల్లాల నిర్మాణం చేపట్టనున్నారు. మిగిలిన స్థలంలో ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తారు. అటవీశాఖకు చెందిన మరో అయిదు వందల ఎకరాల్లో నారసింహ అభయారణ్యం, జింకల పార్కూ రాబోతున్నాయి. ఆలయానికి ఉత్తర దిశగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితర ప్రముఖుల కోసం పదమూడు ప్రెసిడెన్షియల్ సూట్లను నిర్మిస్తున్నారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా రైలు, రోడ్డు, విమాన మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు విస్తరణపనులు ఇప్పటికే జరుగుతుండగా, హైదరాబాద్ నుంచి రాయగిరి వరకూ ఎంఎంటీఎస్ రైల్వే సర్వీసును నడపనున్నారు. ఆకాశయానానికి సంబంధించి యాదాద్రి కొండ కింద రెండు హెలీప్యాడ్‌లను నిర్మించనున్నారు.
దర్శనం ఇలా...
గర్భగుడికి పశ్చిమాన ఉన్న రెండో ప్రాకార రాజగోపురం ద్వారా భక్తులు మాడ వీధిలోకి ప్రవేశిస్తారు. మాడ వీధికి దిగువన గర్భగుడి, మహామండపం (ఆళ్వారు మండపం) ఉంటాయి. ముఖమండపం నుంచి గుహ ఆలయంలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఆళ్వారు మండపంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఆకు పూజలూ వ్రతాలూ చేసుకోవాలనుకునేవారు మహా రాజగోపురానికి ఇరువైపులా ఉన్న మండపాల్లోకి ప్రవేశిస్తారు. అక్కడికి సమీపంలోనే ప్రసాదం కాంప్లెక్స్, శ్రీవారి మెట్లూ ఉంటాయి. శ్రీవారి మెట్ల మార్గంలో ముందుకు సాగితే శివాలయం వస్తుంది. శివుడి దర్శనానంతరం భక్తులు ఇక్కడి నుంచి మళ్లీ వైటీడీఏ వాహనాల్లో గుట్ట కిందకి చేరుకోవచ్చు. దీంతో యాత్ర ముగుస్తుంది. ఇలవైకుంఠాన్ని తలపించే అంతెత్తు యాదాద్రి కొండా పిడికెడంత మారిపోయి భక్తుల హృదయాల్లో ఒద్దికగా ఇమిడిపోతుంది.
నాటి భక్తోత్సవాలు...
వేల ఏళ్ల చరిత్ర ఉన్న యాదగిరిగుట్ట నరసింహస్వామికి స్వాతంత్య్రం రాకముందు నుంచీ భక్తోత్సవాల పేరుతో వేడుకలను నిర్వహించేవారు. తొలుత మూడు రోజులపాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు తర్వాత అయిదురోజుల పాటు కొనసాగేవి. కాలక్రమంలో అవి పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలుగా రూపుదిద్దుకున్నాయి. 1975 నుంచి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం కూడా పాలుపంచుకోవడం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. విష్ణువు అలంకార ప్రియుడు. అందుకే వైష్ణవాలయాల్లో స్వామివారి నిత్యకైంకర్యాలకూ ఉత్సవాలకూ ఎంత ప్రాధాన్యం ఉంటుందో దేవేరులతోకూడిన స్వామిని అలంకరించే విషయంలోనూ అంతే విశిష్టతను కనబరుస్తారు. అందులోనూ బ్రహ్మోత్సవాల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో హడావిడంతా స్వామి ముస్తాబుదే అనడంలో సందేహం లేదు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరిగే యాదగిరీశుడి ఉత్సవాలు ఏ రోజుకు ఆరోజు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. విష్వక్సేనుడి పూజతో మొదలయ్యే ఈ ఉత్సవాలు అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగుస్తాయి. ఎలాంటి ఆటంకాలూ రాకుండా ఉత్సవాలను నిర్వహించే బాధ్యతను అప్పగిస్తూ సేనాధిపతి అయిన విష్వక్సేనుడిని పూజిస్తారు. రెండోరోజు ధ్వజారోహణం, ఆ రాత్రి భేరి పూజనూ చేపడతారు. మూడోరోజు వేదపారాయణ, నాలుగోనాడు హంసవాహన సేవ, ఐదోనాడు కల్పవృక్ష సేవ, ఆరో రోజున గోవర్ధన గిరి అవతారం, ఏడోనాడు స్వామి కల్యాణానికి ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఎనిమిదోరోజు కన్నుల పండుగగా స్వామి కల్యాణం జరుగుతుంది. తొమ్మిదోనాడు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపడతారు. పదో రోజు చక్రస్నానం,
చివరి రోజున అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు.
సాహితీ నృసింహుడు...
యాదాద్రి క్షేత్రం సాంస్కృతిక కళాధామం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు జరుగుతాయి. దాదాపు నూటఅరవై సంవత్సరాలకు ముందే బాపటల లక్ష్మీకాంతయ్య అనే వాగ్గేయకారుడు యాదాద్రి నృసింహుడిమీద తాను రచించిన కీర్తనలతో భక్తులను అలరించేవాడు. సభల ప్రాచుర్యాన్ని గుర్తించిన నిజాం సర్కారు వాటిని బాగానే ప్రోత్సహించేది. ఎక్కువ నిధులు మంజూరు చేసేది. ఆ తర్వాత పాలకమండలి ఏర్పడి ఏటా వివిధ కళాకారులను ఆహ్వానించేది. దివాకర్ల వేంకటావధాని ఈ సభలకు ఎంతో ప్రాచుర్యం కల్పించారు. ఆస్థాన పండితులు వంగీపురం నర్సింహాచార్యులు రచించిన స్వామి నిత్యారాధన, సుప్రభాత సేవ, ప్రపత్తి, స్తోత్రం, మంగళాశాసనం ద్వారానే నేటికీ నిత్యార్చనలు జరగడం విశేషం. క్షేత్ర మహత్యాన్ని స్థానాచార్యులు గోవర్ధనం నర్సింహాచార్యులు గ్రంథస్తం చేశారు. సుమారు వందేళ్ల కిందటే యాదగిరి లక్ష్మీనరసింహ శతకాన్ని రచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ వాటిని ముద్రించి, వెలుగులోకి తెచ్చింది.
చరిత్రకు ఆనవాళ్లు
యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయంలోని ప్రాకార రాతి స్తంభాల మీద వివిధ సాంస్కృతిక చిహ్నాలను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మన చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఈ చిరు ప్రయత్నాన్ని చేస్తున్నారు. దీనికోసం కుబేర స్థానమైన ఈశాన్యం వైపు ఉన్న స్తంభంమీద రెండు, ఐదు, ఇరవై, ఇరవైఐదు పైసల నాణేలూ, వాయవ్య స్తంభంమీద కబడ్డీ, క్రికెట్ మొదలైన ఆటలూ... నైరుతిలో ఆధునిక వ్యవసాయం, పరిశ్రమలూ, చేతివృత్తుల చిత్రాలూ... ఆగ్నేయంలో తెలంగాణ చిత్రపటం, ఉద్యమ దృశ్యం, తెలంగాణ తల్లి విగ్రహం... ఇలా యాదాద్రిలో ఏ స్తంభాన్ని చూసినా తెలంగాణ నాగరికతా సంస్కృతీ కనువిందు చేయనున్నాయి.
- దంతుర్తి లక్ష్మీప్రసన్న
సహకారం: ఆర్.అశోక్‌కుమార్, న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment