
అనిశ్చితి మనసంతా ఆవరించి ఉన్నప్పుడు మనిషి బుద్ధికి ధర్మాధర్మాలు విచక్షించుకోగల శక్తి ఉండదు. కురుక్షేత్ర రణరంగంలో, యుద్ధసన్నద్ధుడై ఉన్న అర్జునుడికి ఎదురైనది అదే పరిస్థితి. ఆ సందర్భంలో భగవంతుడి నోటివెంట వెలువడిన కర్తవ్యబోధనల ఆవిర్భూతమే భగవద్గీత.
భగవద్గీత... అనిశ్చితిని అధిగమించడమెలాగో చెప్పడంతో ఆరంభమై, పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల పైచిలుకు శ్లోకాల్లో, సుఖదుఃఖాలు, భయాలు, రాగద్వేషాల గురించి మనిషికి విశదీకరిస్తుంది. ముందుగా సృష్టి, సృష్టికర్తలిద్దరూ ఒకరేనని అతడికి తెలియాలంటుంది. ఆత్మవిచారంతోనే అది అర్థమవుతుందని, అందుకతడు ఆధ్యాత్మిక సాధనలతో స్థితప్రజ్ఞుడు కావాలంటుంది. స్థితప్రజ్ఞుడైనప్పుడే జననం, మరణం ఆ తరవాత జరిగేదేమిటన్న విషయాలపై స్పష్టత తెచ్చుకుని- తానెవరో, తానెవరు కాదో తెలుసుకుంటూ, కాలాతీత నిరాకార నిర్గుణ బ్రహ్మమైన భగవంతుడితో పునరేకీకరణ పొందగలడంటుంది.
భౌతిక జీవితమే సర్వస్వం అనుకునే మనిషికి, ఆ ఆలోచన సరికాదని భగవద్గీత సహేతుకంగా చెబుతుంది. అతడి మేధస్సు అందుకోలేని విశ్వస్వరూపం, జ్ఞానస్వరూపం, పరమాత్ముడి రూపం వంటి అంశాలపై సులభగ్రాహ్యమైన శాస్త్రీయత గోచరించే వివరణలిస్తుంది. సిద్ధాంత రూపంలో భగవంతుడే అందించి, అవి ఆచరించటం ఎలాగో ఆయనే చెప్పిన, ఆధ్యాత్మిక సాధనల ప్రస్తావనే గీతఅంతటా కనిపిస్తుంది.
గీత చెప్పే ఆ యోగమార్గాలన్నీ ఆత్మచైతన్యం కోసం మనిషి ఎక్కవలసిన సోపానాలే. సాంఖ్యబుద్ధి, యోగబుద్ధి ఉన్నప్పుడే ఇహపర సౌఖ్యాలు రెండింటికీ అతడు చేరువలో ఉంటాడని చెప్పే సందేశం అన్ని అధ్యాయాల్లో అంతర్లీనమై ఉంటుంది. అందులోని జ్ఞానయోగం మనిషి తన బుద్ధిభావనలు నిర్మూలించుకుని ఆత్మావలోకనం దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. కర్మయోగం అతడిని ధర్మవిరుద్ధమైన కర్మలజోలికి పోవద్దంటుంది. అవన్నీ ధర్మానుసారంగా జరపడమెలాగో చెబుతుంది. నిష్క్రియ జీవితానికి ప్రత్యామ్నాయం కాకుండా చూసుకుంటూ, కర్మయోగిలా జీవించమంటుంది. మనిషి చేసే కర్మలన్నీ పురుష ప్రయత్నాలేనని, ఈశ్వరార్పణంగా, ఫలాపేక్ష లేకుండా వాటిని చేపట్టినప్పుడు జరిగేదే విధి నిర్ణయం అని చెబుతూ, అది ఎలాగ ఉంటుందో అతడు తెలుసుకోలేడంటుంది. భక్తియోగం, భగవంతుడిని చేరుకోవాలన్న తపనలో ఉండే అతడికి, సుగమమైన మార్గాలనే సూచిస్తూ, ఆధ్యాత్మిక సాధనలను సులభతరం చేస్తుంది. రాజయోగం, బుద్ధిని ప్రాపంచికపరమైన ఆలోచనలనుంచి దూరంగా ఉంచి, భావరహితస్థితికి చేర్చి, అంతిమ సత్యమైన ఆ భగవంతుడొక్కడినే అతడికి చూపించగల సాధనలు నేర్పిస్తుంది.
భగవద్గీత ఆధ్యాత్మికులకే పరిమితం కాదు. అది మతగ్రంథమూ కాదు. చదువుతున్నకొద్దీ వ్యక్తిత్వ వికాసం అనే మాటకు సమగ్రమైన వివరణలు ఇవ్వగల కరదీపికలాంటి మహాగ్రంథమది. గీతాపారాయణంతో మనిషి, నిత్యమేదో సత్యమేదో తెలుసుకుంటూ, తన జీవిత గమనానికి తానే దిశానిర్దేశం చేసుకోగల సమర్థుడవుతాడు. గీత అనే గంగలో మునిగి ఒక్క స్నానం చేస్తే భౌతికజీవన కాలుష్యాలన్నీ తొలగిపోతాయని ధార్మికులందరి దృఢవిశ్వాసం. సమయం చేసుకుని ఒకేసారి కాకపోయినా వీలున్నప్పుడల్లా జీవితకాలమంతా చదువుకుంటూ పోతూఉంటే, శైశవదశలో ఉన్న ఆ మనిషి ఆధ్యాత్మికత శిఖరాగ్రానికి చేరుకుంటుంది.
- జొన్నలగడ్డ నారాయణమూర్తి
No comments:
Post a Comment