
మౌల్వీ నసీరుద్దీన్ కథల్లో మనిషికి కనువిప్పు కలిగించే ఉదంతం ఒకటుంది. తైమూరు ఆ దేశపు రాజు. ఆయనకో రోజు ఎందుకో తన ఆస్థానంలో మూర్ఖులు పెరిగిపోయారని అనుమానం వచ్చింది. వెంటనే మంత్రి నసీరుద్దీన్‌ను పిలిపించాడు. తన కొలువులోని మూర్ఖుల జాబితా తయారు చేయమని పురమాయించాడు.
నసీరుద్దీన్ ఒక పట్టిక రూపొందిస్తూ మొదటే రాజుగారి పేరు రాశాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. మంత్రి మన్నించమని అడుగుతూనే, ‘ప్రభూ! మన దివాణంలో మూర్ఖులున్నారని తెలిసీ, వారికి వృథాగా జీతభత్యాలిచ్చి పోషిస్తున్నారంటే- ఈ జాబితాలో మొట్టమొదటివారు మరి మీరే కదా!’ అని ప్రశ్నించాడు.
తైమూరుకు కోపం పెరిగిపోయింది. ‘నా దగ్గర పనిచేసేవాళ్లంతా తెలివైనవారేనని నిరూపణ అయితే, నీకు ఏం శిక్ష వేయవచ్చు’ అని ప్రశ్నించాడు. నసీరుద్దీన్ బదులిస్తూ, ‘తెలివైనవారిని అనుమానించడం, అవమానించడం మూర్ఖుడి స్వభావం కనుక, అప్పుడూ మీ పేరే ముందుంటుంది’ అన్నాడు.
తైమూరుకు ఈసారి తిక్క పెరిగిపోయింది. ‘నా ఉద్యోగులందరూ ఎంతో వివేకవంతులు... వారందరిలో నువ్వు ఒక్కడివే పరమ మూర్ఖుడివని రుజువు చేస్తా చూడు’ అని సవాలు విసిరాడు. ‘అప్పటికీ మొదటిస్థానంలో మీరే ఉంటారు మహాప్రభూ’ అన్నాడు నసీరుద్దీన్. ‘రాజోద్యోగులందరూ చక్కని బుద్ధిమంతులై ఉండగా, మూర్ఖుల జాబితా రాయమని ఒక మూర్ఖుడికి పని పురమాయించినవాడు అందరికన్నా మూర్ఖుడు. అవునా, కాదా! మీరే ప్రశాంతంగా ఆలోచించండి’ అని విన్నవించాడు మంత్రి.
‘మరణించేలోగా ఈ లోకంలోని మూర్ఖుల సంఖ్యలోంచి ఒకటి తగ్గేలా చూడు... అదెవరో కాదు, నువ్వే!’ అని సుప్రసిద్ధ తత్వవేత్త పైథాగరస్ చెప్పిన మాట ఇలాంటి సందర్భాలకు అతికినట్లు సరిపోతుంది. ‘ఆ విషయంలో చాలా మూర్ఖంగా వ్యవహరించాను’ అని జీవితంలో చింతించనివారంటూ లోకంలో ఉండరు. చాలా సందర్భాల్లో మూర్ఖంగా ఆలోచించడం మనిషి స్వభావంలోనే ఉంది. వాటిని గుర్తించి మరోసారి అలా ప్రవర్తించకపోవడంలోనే మనిషి సంస్కారం వెల్లడవుతుంది.
‘నాది గట్టి పట్టుదల’ అని నమ్ముతాడు భర్త. ‘ఆయన వట్టి మొండిఘటం... చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని నిట్టూరుస్తుంది భార్య. ఇల్లాళ్లు ఎంతో నేర్పుగా చక్కబెట్టామని భావించే పనులు, చవగ్గా బేరం చేశామనుకొనే వస్తువులు భర్తలకు మాత్రం మూర్ఖత్వానికి రుజువులుగా కనిపిస్తాయి. ‘మూర్ఖురాళ్ల మనసు రంజింపజేయడం మన వల్ల కాదు’ అనుకొంటూ సర్దుకుపోతుంటారు భర్తలు.
జపాన్ మల్లయోధులను ‘సమురాయ్’ అంటుంటారు. అలాంటివారిలో ఒకడు రాజయ్యాడు. ఆయనకు ఉన్నట్లుండి స్వర్గానికి, నరకానికి తేడా ఏమిటన్న సందేహం వచ్చింది. అప్పటికప్పుడే తన ఆధ్యాత్మిక గురువు ఆశ్రమానికి పరుగెత్తి, ఆయన ప్రశాంతంగా జపం చేసుకుంటుంటే పట్టి కుదిపాడు. ఆయన కళ్లు తెరిచి విన్నా, ఈ సందేహాన్ని పట్టించుకోలేదు. జవాబు చెప్పలేదు. రాజుకు అసహనం, పంతం పెరిగిపోయాయి. తీవ్ర క్రోధంతో కత్తి దూసి గురువు తల నరికేయబోయాడు.
గురువు అప్పుడు చిన్ననవ్వు నవ్వి ‘ఇప్పుడు నువ్వున్నది నరకంలోనే’ అన్నాడు. ఆ మాటలోని అంతరార్థం తోచగానే రాజు నిలువునా నీరైపోయాడు. ‘అయ్యో! ఎంత మూర్ఖంగా వ్యవహరించాను’ అంటూ గురువు కాళ్ల మీదపడి వలవల ఏడ్చాడు. అతణ్ని లేపి లాలనగా చెప్పాడు గురువు- ‘ఇప్పుడు స్వర్గంలో ఉన్నావు నువ్వు’ అని.
మూర్ఖంగా వ్యవహరించిన ప్రతి సందర్భం ఎదుటా మనిషి సరిగ్గా ఇలాగే మోకరిల్లి ఆత్మ పరిశీలన చేసుకొంటే- పైథాగరస్ కోరికను నిజం చేయడం సాధ్యమవుతుంది. నరకం లాంటి ఈ లోకం స్వర్గం అవుతుంది!
- వై.శ్రీలక్ష్మి
No comments:
Post a Comment