
దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!
దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది.
దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.
మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి హారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
No comments:
Post a Comment