Translate

Thursday, December 19, 2019

అమ్మవారి అర్చనలు

మానవుడు చేసిన కర్మలనునసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది, సాధకుని యొక్క సాధనను బట్టి అన్నిరకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ  ముక్తి 5 రకాలు గా వర్ణించ బడింది.

1.మణిపూరంలో దేవిని అర్చించే వారికి “సార్షిరూపముక్తి”.(మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.)

2.అనాహతంలో దేవిని అర్చించేవారికి “సాలోక్యముక్తి”(అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు.
దీన్ని సాలోక్యముక్తి అంటారు.)

3.విశుద్ధిచక్రంలో దేవిని అర్చించే వారికి 'సామీప్యముక్తి” (విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు.
ఇది సామీప్యముక్తి.)

4.ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి “సారూప్యముక్తి”(ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన
రూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.)

5.సహస్రారంలో దేవిని అర్చించే వారికి “సాయుజ్యము”(సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ
ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.
లభిస్తాయి.)

ఇవేకాక భక్తులకు వారివారి కర్మానుసారము స్వర్గనరకాలు ప్రాప్తిస్తాయి.

స్వర్గసుఖాలు ఎంతకాలం అనుభవించాలి ? తిరిగి ఎప్పుడు జన్మించాలి ? అనేది
నిర్ణయించేది కూడా ఆ పరమేశ్వరీ. ఈ రకంగా ఆ దేవి మానవులకు సద్దతులను ప్రసాదిస్తుంది.

పద్మపురాణంలో చతుర్దశినాడు మూడు కాలములందు దేవిని ఎవరైతే పూజిస్తారో వారు పరాస్థానము పొందుతారు అని చెప్పబడింది.

ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది.

🕉️పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారై,
బాగా ఆలోచించి సామీప్యముక్తి పొందినట్లైతే దేవికి అతిసమీపంగా ఉండి ఆమెను
సేవించవచ్చు అని తలపోసి, విశుద్ధిచక్రంలో ఆమెను ఉపాసించారు. అందువల్ల దేవికి
సేవకులుగా, అత్యంతదగ్గరగా ఆమె యొక్క సింహాసనానికి కోళ్ళుగా ఉండగలిగారు.

ఈ విషయాన్ని శంకరభగవత్సాదుల వారు తమ సౌందర్య లహరిలోని 92వ శ్లోకంలో
వర్ణిస్తూ
గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః*
*శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|*
*త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా*
*‌శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌||92||*

ఓ భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే
సింహాసనానికి కోళ్ళుకాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు.
శ్రీచక్రంలో 5 ‌శక్తిచక్రాలు, 4 శివచక్రాలు ఉన్నాయి. ఇందులోని శక్తిచక్రాలే
పంచబ్రహ్మలు. ఈ శక్తిచక్రాలకు పైన దేవి ఉంటుంది. కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థితా అనబడుతోంది.
మానవశరీరంలో షట్బక్రాలున్నాయి. ఆ చక్రాలలో ప్రతిదానికీ అధిదేవతలున్నారు.

ఆధారచక్రానికి అధిదేవత - గణపతి
స్వాధిష్టానానికి అధిదేవత - బ్రహ్మ
మణిపూరానికి అధిదేవత - విష్ణువు
అనాహతానికి అధిదేవత - రుద్రుడు
విశుద్ధిచక్రానికి అధిదేవత - మహేశ్వరుడు
ఆజ్ఞాచక్రానికి అధిదేవత - సదాశివుడు

వీటన్నింటికీ పైన సహస్రారంలో ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆమె
పంచటబ్రహ్మాసనస్థితా అని చెప్పబడుతోంది.
 
తనకున్నంతలో పుష్కలంగా పూజాద్రవ్యాలు తెచ్చి పరమేశ్వరిని అర్చించినవాడు శివసాన్నిధ్యం పొందుతాడు.

సద్గతులు రెండు రకాలు 1. ఇహము 2. పరము. ఐహికమైన వాంఛలతో పరమేశ్వరిని అర్చించిన వాడికి భోగభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి.

🕉️"దుర్వాస మహర్షి శ్రీచక్ర పూజాఫలాన్ని చెబుతూ"

ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం

ఆ దేవిని ఏ కోరికతో అర్చిస్తే అది తీరుతుంది. ఈ జగత్తులో ఇహం కావాలి అంటే పరం ఉండదు. పరం కావాలంటే ఇహం ఉండదు. అనగా భోగభోగ్యాలు కావాలి అంటే ముక్తి ఉండదు. అలాగే ముక్తికావాలంటే భోగభాగ్యాలను త్యజించాలి.

యత్రా పిభోగో న చ తత్ర మోక్షః యత్రా పి మోక్షోన చ తత్ర భోగః |

శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ ॥

కాని పరమేశ్వరిని అర్చించిన వారికి భోగము, మోక్షము ఏది కావాలంటే అది దొరుకుతుంది.

ఈ జగత్తులో చతుర్దశభువనాలున్నాయి. అందులో భూలోకానికి పైన ఆరు లోకాలున్నాయి. మానవుడు చేసిన కర్మ ఆధారంగా అతడు పైలోకాలకుపోతాడు. అవన్నీ సద్గతులే.

మానవుడు తాను చేసిన కర్మఫలాన్ని బట్టి ఉత్తరజన్మ పొందుతాడు. లోకంలో 84 లక్షల రకాల జీవరాసులున్నాయి. క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, కుక్కలు, పిల్లులు చివరకు మానవుడు అన్ని జన్మలలోకి మానవజన్మ
దుర్లభమైనది.

No comments: