Translate

Tuesday, December 29, 2020

ఏ ఇంట్లో శుభాలు ఎక్కువ జరుగుతాయి

గృహ ఆవరణలో గోవు పాదం మోపిన,
వేదమంత్ర ఉచ్చారణ జరిగినా,
తులసి,మారేడు మందార మొక్కలు పెంచుతున్నా,
ఆవుపేడ పిడకలతో  వంట వండుతున్న,
నిత్యం గుమ్మానికి పసుపు రాస్తున్నా,
రావి,మారేడు,ఉత్తరేణి,చండ్ర, మోదుగ,ఆర్కా,శమి, మేడి సమిధ లతో హోమం చేస్తున్నా 
అక్కడ దేవతాశక్తి కొలువై సమస్త అమంగళాలు తొలగి,...శుభాలు చేకూరును.

ఏ ఇంటిని స్మశానం అనవచ్చు


                        ||శ్లోకము||
||న విప్ర పాదోదక కర్దమాని 
న వేదశాస్త్ర ధ్వని గర్జితాని |
స్వాహా స్వధాకార వివర్జితాని 
శ్మశాన తుల్యాని గృహాణి తాని || 

||తాత్పర్యము||
బ్రాహ్మణుల పాదములు కడిగిన నీరు పారనట్టివి , 
వేదశాస్త్ర పాఠపఠనాధ్వనులచే ఘోషిల్లనట్టివీ , 
యజ్ఞమంత్రముల చివర పలికెడు స్వాహా అను శబ్దములు , పితరులకీబడిన భోజనమును పొగడునట్టి శబ్దములు (స్వధా) లేనట్టివియగు గృహములు శ్మశానభూములతో  సమానములు
                             — చాణక్య నీతి శాస్త్రము ---


మరి స్వర్గతుల్యమైన గృహములేవి ?
ఈ శ్లోకానికి కొద్దిగా మార్పు చేస్తే  స్వర్గముతో సమానముగా గృహములు భాసించును 

||శ్లోకము||

॥స విప్ర పాదోదక కర్దమాని  
స వేదశాస్త్రధ్వని గర్జితాని|
స్వాహా స్వధాకార నిరంతారాణి స్వర్గాణి తుల్యాని గృహాణి తాని||

||తాత్పర్యము||
బ్రహ్మణుల పాదములు కడిగిన నీరు పారునవి ,  
వేదశాస్త్ర పాఠపఠనా ధ్వనులు ప్రతిధ్వనించునవి, 
దేవ పితృ కార్యక్రమంలో  హవిస్సును భుజింపుడు  చేయు స్వాహా స్వధా ధ్వనులు గల గృహములు స్వర్గముతో సమానమయినవిగా గ్రహింపవలెను 

Wednesday, December 23, 2020

ముక్కోటి ఏకాదశి విశిష్టత

పురాణాల ప్రకారం.. వేదాలను దొంగిలించిన ఇద్దరు రాక్షసుల (మధు, కైటభ)ను శ్రీమహావిష్ణువు వధించారు. తర్వాత వారికి మోక్షాన్ని ప్రసాదించగా.. వారు వైకుంఠంలోని ఉత్తర మార్గం ద్వారా వెళ్లి స్వామివారి ఎదుట మోకరిల్లారు. ఈ ముక్తి ప్రాప్తి తమకే కాదు, సౌరమాన మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రాణికోటి అందరికీ ప్రసాదించాలని ఆ అసురులు కోరారు. అందుకు విష్ణుమూర్తి సమ్మతించారు. అందుకే మన సంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఇంతటి ప్రాశస్త్యం!

Monday, December 14, 2020

పోలి స్వర్గం

కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.

కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.

ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.

_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.
ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

కార్తీక పురాణం - 29 వ అధ్యాయము

అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము



అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ!5 ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీకొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి5 ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.

Sunday, December 13, 2020

అభిషేక ప్రియుడు శివుడు

అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. 

శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా 

పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. 

తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది.గ్రహదోషాలు తొలగిపోతాయి. 

బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.

 చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

 పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 

నేతిలో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. 

పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. 

పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. 

బత్తాయిపండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. 

చెరకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. 

నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం వుండదు. యమభయం వుండదు.

కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. 

ఉసిరికాయపొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయం అవుతాయి. 

పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. 

చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తిప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.

అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. 

తేనెతో ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతం అవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతారు. 

బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా

సౌభాగ్యలక్ష్మీ  రావమ్మా
     సౌభాగ్యలక్ష్మీ రావమ్మా  అమ్మా

1   నుదుట  కుంకుమ  రవిబింబముగ  కన్నులనిండుగ కాటుక వెలుగ ||
     కాంచనహారము గళమున  మెర యగ పీతాంబరముల శోభలునిండగ  ||       
                                                                                ||సౌభాగ్య||

2   నిండుగ  కరముల  బంగరుగాజులు  ముద్దులొలుక  పాదమ్ముల మువ్వలు ||
     గలగల  గలమని సవ్వడి  చేయగ సౌభాగ్యవతులసేవలనందగ ||
                                                                               ||సౌభాగ్య||

3   నిత్యసుమంగళి  నిత్యకళ్యాణి  భక్తజనులకూ కల్పవల్లి ||
     కమలాసనవై  కరుణనిండగా  కనకవృష్టి కురిపించే  తల్లి ||
                                                                               ||సౌభాగ్య||

4   జనకరాజుని   ముద్దుల కొమరిత  రవికులసోముని  రమణీమణివై ||
     సాథుసజ్జను లపూజలందుకొని శుభములనిచ్చెడి  దీవనలీయగ ||
                                                                               ||సౌభాగ్య||

5   కుంకుమ  శోభిత  పంకజలోచని  వెంకటరమణుని పట్టపురాణి ||
     పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మాయింట వెలసిన ||

        

శని శాంతి మంత్రం

 
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.

ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

కార్తీక పురాణం - 28 వ అధ్యాయము

విష్ణు సుదర్శన చక్ర మహిమ


 జనక మహారాజా ! వింటివా దుర్వాసుని అవస్ధలు ! తాను ఎంతటి కోపవంతుడైనను , వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున , ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి *"అంబరీషా , ధర్మపాలకా ! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము , నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి , కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్దించితిని . ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"* మని అనేక విధాల ప్రార్ధించగా , అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి , *"ఓ సుదర్శన చక్రమా ! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో , తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన , ఈతనిని చంపవలదు , ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని , ముందు నన్నుచంపి , తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి , నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు , దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా ! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు , నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.*

*నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును , శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము"* అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి *"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా ! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు , మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు ఏకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ! ఈ లోకములో దుష్టశిక్షణ , శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే , ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి , నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి , ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.*

*ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని , శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను , కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.*

*ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి , శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు"* మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి , *" నేను దేవ గో , బ్రాహ్మణాదులయుందును , స్త్రీలయందును , గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా అభిలాష. కాన , శరణుగోరిన ఈ దుర్వాసుని , నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు , కోట్ల కొలది సూర్య మండలములు ఏక మైననూ నీ శక్తీకి , తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి , వారిని శిక్షించి , తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన , నికివే నామనఃపూర్వక నమస్కృతులు"* అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి *"అంబరీషా ! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో , ఎవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో , ఎవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి , ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన , నిన్నూ , దుర్వాసుని రక్షించుచున్నాను , నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు."* అని చెప్పి అతన్నీ ఆశీర్వదించి , అదృశ్యమయ్యెను.


స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

కార్తీక పురాణం - 27 వ అధ్యాయము

దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట


మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు. కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.

Friday, December 11, 2020

కార్తీకపురాణం 26 అధ్యాయం

దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ

ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గి౦చుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వి౦శోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.

        

Thursday, December 10, 2020

జ్వాలా తోరణ మాహాత్మ్యం (జ్వాలా తోరణం ఎందుకు చేస్తారు?)

కార్తికమాసం జ్వాలా తోరణం లో ఒక్కసారైనా తప్పక ప్రవేశించాలని శాస్త్ర వచనం. కార్తిక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. 

  కార్తిక పూర్ణిమనాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

      

             
 యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి.
 ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం.
 
        అందుకే కార్తికపూర్ణిమ రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు.

అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనక మరో తత్త్వకోణం కూడా ఉంది.

      జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే...

    ‘‘ *శివా! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’
 
అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు.
అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.

Wednesday, December 9, 2020

కార్తీక పురాణం - 25 వ అధ్యాయము

దూర్వాసుడు అంబరీషుని శపించుట

"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 

 స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం


శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్

మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”
 
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం 

భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,
దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .

కార్తీక పురాణం - 24 వ అధ్యాయము



అంబరీషుని ద్వాదశీవ్రతము

అత్రి మహాముని మరల అగస్త్యునితో "ఓ కుంభసంభవా! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.

"గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసిన౦దువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.

కార్తీక శుద్ధదశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము"అని యిట్లు చెప్పుచున్నాడు.

పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన, తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల క౦గీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. "ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యెంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక, యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు." అని అలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగట్టగలదు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

"ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి యింతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభ౦గమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి "మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహే౦ద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్త కలుగచేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ యగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును, మహతపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను" అని విశదపరచిరి.

 స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వి౦శోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.

Tuesday, December 8, 2020

కార్తీకపురాణం 23 అధ్యాయం


శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట

అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదా౦గవేత్తయై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా  ఒకానొకనాడు అశరీరవాణి "పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు" అని పలికెను.

అంతట పురంజయుడు ఆ యశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది, చేతులు జోడించి, "దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా ! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బేదకులై, నిరంతరము విజయశశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారమువప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.

 స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.

     

Monday, December 7, 2020

కార్తీక పురాణం - 22 వ అధ్యాయము

పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట


మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.
పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానముచేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి "రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును", అని దీవించి అదృశ్యుడయ్యెను. "ఈతడెవరో మహాను భావునివలె నున్నాదు, అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

ఆ యుద్దములో కా౦భోజాది భూపాలురు ఓడిపోయి "పురంజయా రక్షింపుము రక్షింపు"మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా 'శ్రీ హరి' అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడు౦డును. సంసారసాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండెను.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ యిల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

 స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావి౦శోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.

కార్తీక పురాణం - 21 వ అధ్యాయము



పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట


ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు , కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్దము జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను , అశ్వసైనికుడు అశ్వసైనికునితోను , గజసైనికుడు గజసైనికునితోను , పదాతులు పదాతి సైనికులతోను , మల్లులు మల్లయుద్ద నిపుణులతోను ఖడ్గ , గద , బాణ , పరశువు మొదలగు ఆయుధాలు ధరించి , ఒండొరుల ఢీ కొనుచు హుంకరించుకొనుచు , సింహ నాదములు చేసుకొనుచు , శూరత్వవీరత్వములను జూపుకోనుచు , భేరీ దుందుభులు వాయించుకొనుచు , శంఖములను పూరించుకొనుచు , ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు , తెగిన మొండెములు , తొండలు , తలలు , చేతులు - హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాల వలె పడియున్న ఏనుగుల , గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే. ఆ మహా యుద్దమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమై పోయెను. అయినను , మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో , పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.

దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి *"రాజా ! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడవై వున్నందుననే ఈ యుద్దమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఏరంగియు , నీవు చింతతో కృంగి పోవుటయేల ? శత్రురాజులను యుద్దములో జయించి , నీరాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేని , నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీకమాసము. రేపు కృత్తికానక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన , స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి , భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు , శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక , రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకీ అపజయము కలిగినది ? గాన లెమ్ము. శ్రీహరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు"* మని హితోపదేశము చేసెను.


అపవిత్రః పవిత్ర వా నానావస్దాన్ గతోపివా |
యః స్మరే *త్పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరశ్శుచిః ||


 స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఏకవింశోధ్యాయము - ఇరవయ్యోకటోరోజు పారాయణము సమాప్తము.

Saturday, December 5, 2020

కార్తీక పురాణం - 20 వ అధ్యాయము

పురంజయుడు దురాచారుడగుట


జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో "గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు"డనెను. అ మాటలకు వశిష్టుల వారు మందహాసముతో "ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి, అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు"మని అ కథా విధానమును యిట్లు వివరించిరి.

పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి, "ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము.

త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతును, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామాలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై - నవారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రుసైన్యములుపై బడెను.

  స్కాంద పురాణాతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము

Friday, December 4, 2020

కార్తీక పురాణం - 19 వ అధ్యాయము

ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి "ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు" అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు "ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.

నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నీధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళించెను.

వశిష్టుడు జనకమహారాజుతో "రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీ మన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.

 స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.

Thursday, December 3, 2020

కార్తీక పురాణం - 18 వ అధ్యాయము

"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్యఫలప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.

"ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  చేయవలెను. అటుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

"ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తర౦గా విశదికరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

"ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".

తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రు౦డును, చతుర్బాహు౦డును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు ధించవారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి  రక్షింపు"మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు "యీ ముసలి వానితో మనకేమి పని"యని ఊరకు౦డిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా?"యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

*శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*
*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*
*లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*
*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*

*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*
*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*
*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*
*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.

Wednesday, December 2, 2020

కార్తీక పురాణం - 17 వ అధ్యాయము

అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము

ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా

"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖింగావుంది' అనుకోనునదియే ఆత్మ.  

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము

Tuesday, December 1, 2020

ఆంజనేయస్వామి అవతారాలు

ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు.
అవేంటంటే..
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు.
ఆంజనేయస్వామి గురించి కొన్ని ...
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు

అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.
స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
పంచముఖ హనుమాన్:
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.
1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

హనుమంతుడి సందేశం ?
హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

సేకరణ.

నాగదోష పరిహార స్తోత్రమ్ (శ్రీమద్దేవీ భాగవతం)

సర్ప దోషాలు ఉన్నవారు తప్పక చదవాల్సిన
నాగదోష పరిహార స్తోత్రమ్||


యోగినో విశ్వపూజ్యస్య జరత్కారుప్రియా తతః |
జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ ||
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా |
జరత్కారుప్రియా ఆస్తీకమాతా విషహరేతి చ||
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా |
ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ ||
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ |


◆ నాగదేవతా స్తోత్రము ఫలశ్రుతి :
ఈ ద్వాదశ నామమంత్రములను లేదా స్తోత్రమును పూజాసమయంలో లేదా నిద్రకు ముందు పఠిస్తే నాగభీతి ఉండదు. రోజుకు 3 సార్లు పఠిస్తే  నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు  కూడా తొలగిపోతాయి. పారాయణము చేసేవారికి ఇన్ని గొప్ప శుభాలు  నాగదేవతలు ప్రసాదిస్తున్నప్పుడు నిత్యం తలచుకోకుండా ఉండలేము కదా!

కార్తీక పురాణం -16వ అధ్యాయము

స్తంభ దీప ప్రశంస

వశిష్టుడు చెబుతున్నాడు -
"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత  ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ  విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.

సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు  ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు  శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.

*దీప స్తంభము విప్రుడగుట*

ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను జూచి "ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ  పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక  స్తంభముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము, రండు" అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి  వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి "ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి" అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష  జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని, నన్ను మన్ని౦పు" డని వేడుకొనెను.

ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్యమొంది "ఆహా! కార్తీకమాసమహిమ మెంత గొప్పది అదియునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్త౦భమునకు ముక్తికలిగిన" దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి "మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నాయీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో నోకడగు అంగీరసమునితో "స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. అంత నా౦గీరసుడిట్లు చెప్పుచున్నాడు.

స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తం

Sunday, November 29, 2020

తులసి స్తోత్రం


జగద్దాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే,
యతో బ్రహ్మోదయో దేవాః సృష్టిస్థిత్యన్తకారిణః

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే,
నమో మోక్షప్రదే దేవి నమః సమ్పత్పృదాయి కే

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా,
కీర్తితా వా స్మృతా వాపి పవిత్రయతి మానవమ్

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తమామ్,
యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యన్తే సర్వకిల్బిషాత్

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్,
యా వినిర్హన్తి పాపాని దృష్ట్వావా పాపిభిర్న రైః

సమస్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం కలౌ,
కలయన్తిసుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే

తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే,
యయా పవిత్రతో లోకో విష్ణుసంగేన వైష్ణవః
 
తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ,
ఆరోపయతి సర్వాణి శ్రేయంసి వరమస్తకే

తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః,
అతస్తా మర్చయేల్లోకే సర్వాన్దేవాన్స మర్చయన్

నమస్తులసి సర్వజ్ఞే పురుషొత్తమవల్లభే
పాహి మాం సర్వపాపేభ్యః సర్వసమ్పత్పృదాయికే

ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా,
విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః

తులసీ శ్రీమహలక్ష్మీర్విద్యా విద్యా యశస్వినీ,
ధర్మా ధర్మాననా దేవీ దేవ దేవమనఃప్రియా

కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే చతుర్దశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం

వసిష్ఠఉవాచ

పౌర్ణమ్యాంకార్తికేమాసి వృషోత్సర్గం కరోతియః
తస్యపాపాని నశ్యమ్తి జన్మాంతరకృతానిచ!!

తా: వసిష్ఠుడు చెప్పుచున్నాడు, కార్తీకపౌర్ణమిని వృషోత్సర్జనము చెయుటవలన జన్మాంతర పాపములు నశించును. (వృషోత్సర్జనము అనగా ఆంబోతును వదులుట)

యఃకార్తికేవృషోత్సర్గం పౌర్ణమ్యాంపితృతృప్తయే
సంకుర్యాద్విధినా రాజన్ తస్యపుణ్యఫలంశ్రుణు!!
గయాశ్రాద్ధంకృతంతేన కోటివారంనసంశయః
పుణ్యదం మానుషేలోకే దుర్లభం కార్తికవ్రతమ్!!
*తా:* కార్తీకమాస వ్రతము ఈ మనుష్యలోకంలో దుర్లభము, అనగా సులభముగా ముక్తిమార్గమునిచ్చునని భావము, కార్తీకపున్నమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్జనమును చేయువానికి కోటిరెట్లు గయాశ్రాద్ధఫలము చెందుతుంది.

యఃకోవాస్మత్కులేజాతః పౌర్ణమాస్యాంతు కార్తికే
ఉత్సృజేద్వృషభంనీలం తేనతృప్తావయంత్వితి
కాంక్షఁతినృపశార్దూల పుణ్యలోకస్థితా అపి!!
పౌర్ణమ్యాం కార్తికేమాసి ఆఢ్యో వాప్యధమోపివా
నోత్సృజేద్వృషభంలోభా త్సయాత్యంధతమోయమాత్!!
పిండదానాద్గయా శ్రాద్ధా త్ప్రత్యబ్దం ప్రతివత్సరే
పుణ్యతీర్థాసంగమనా త్తర్పణాచ్చమహాలయాత్
కార్తికేపౌర్ణిమాస్యాంతు వృషోత్సర్గం వినాగతిః!!
గయాశ్రాద్ధం వృషోత్సర్గం సమమాహుర్మనీషిణః
ప్రశస్తమూర్జెపౌర్ణమ్యాం వృషోత్సర్గస్సుఖప్రదః!!
*తా:* స్వర్గమందున్న పితరులు మనవంశమందు ఎవరైనా కార్తీకపున్నమినాడు నల్లని గిత్తను విడుచునా? ఆ విధముగ ఎవరైనా వృషోత్సర్జనము చేసిన తృప్తిపొందెదము అని కోరుకుంటూంటారు. ధనవంతుడుగానీ, దరిద్రుడుగానీ, కార్తీకపున్నమినాడు లోభమువల్ల వృషోత్సర్గమను ఆంబోతునువిడుచుక్రియను చేయనివాడు యమలోకమున అంధతమిస్రమను నరకమును పొందెదరు. కార్తీకపున్నమి రోజున వృషోత్సర్గమును చేయక, గయాశ్రాద్ధము చేసిననూ ప్రతిసంవత్సరమూ తద్దినము పెట్టిననూ పుణ్యతీర్థములు సేవించిననూ మహాలయము పెట్టిననూ పితరులకు తృప్తిలేదు. గయాశ్రాద్ధమును, వృషోత్సర్జమును సమానమని విద్వామ్సులు చెప్పిరి, కనుక, కార్తికపున్నమి నాడు వృషోత్సర్జనము సుఖమునిచ్చును.

యఃకుర్యాత్కార్తికేమాసి సర్వధర్మాధికం ఫలం
ఋణత్రయాద్విముచ్యేత కిమన్యైర్బహుభాషణైః!!
యోధాత్రీఫలదానంతు పౌర్ణమ్యాంచసదక్షిణం
కురుతె నృపశార్దూల సార్వభౌమోభవేద్ధృవమ్!!
యంకుర్యాద్దీపదానంచ పౌర్ణమ్యాం కార్తికేనఘ
సర్వపాపవినిర్ముక్తో తతో యాంతి పరాంగతిమ్!!
కర్మణామనసావాచా పాపంయస్సమ్యగాచరేత్
తస్యపాపానినశ్యంతి కార్తిక్యాందీపదానతః!!
లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాంశివతుష్టయే
ఇహసమ్యక్ఫలం ప్రాప్య సార్వభౌమోభవేద్ధ్రువమ్!!
పాపఘ్నం పుణ్యదంప్రాహుర్లింగదానం మనీషిణః
లింగదానమనాదృత్య యఃకుర్యాత్కార్తికవ్రతం
వజ్రలేపోభవేత్తస్య పాపరాశిర్నసంశయః!!
*తా:* అనేక మాటలేల? కార్తీకపున్నమినందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానముచేయువాడు దేవ-పితృఋణ, ఋషిఋణ, మనుష్యఋణములనుమ్చి విముక్తినొందును. కార్తీకపూర్ణిమనాడు దక్షిణతోకూడి ధాత్రీఫలమును దానమిచ్చినవాడు సార్వభౌముడగును. కార్తీక పూర్ణిమనాడు దీపదానమాచరించినవారు విగతపాపులై పరమపదమునొందెదరు. కార్తీకమాసమమ్దు దీపదానమాచరించువాని మనోవాక్కాయములచేత చేసిన పాపములు నశించును. కార్తీకపున్నమి నాడు లింగదానమాచరించువాడు ఈ జన్మమునందు అనేక భోగములననుభవించి ఉత్తరజన్మమందు సార్వభౌముడగును.  లింగదానము వలన పాపములు శమించి, పుణ్యము గలుగును, కార్తీకమాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమూ కరుగవు.

అనంతఫదంప్రోక్తం దుర్లభం కార్తికవ్రతం
పరాన్నంపితృశేషంచ నిషిద్ధస్యచ భక్షణం
శ్రాద్ధాన్నం తిలదానం చ కార్తికేవం చ వర్జయేత్!!
గణాన్నంవృషలస్యాన్నం దేవలాన్నమసంస్కృతం
వ్రాత్యాన్నంవిధవాన్నంచ కార్తికేషడ్వివర్జయేత్!!
అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దేభానువాసరే
సోమసూర్యోపరాగేచ ఊర్జేననిశిభోజనమ్!!
ఏకదశ్యామహోరాత్రం వ్యతీపాతేచ వైధృతౌ
నిసిద్ధదివసేరాజన్ గృహీయః కార్తికవ్రతే!!
విష్ణోర్దినస్యయత్నేన పూర్వోత్తరదినద్వయే
మాసనక్తవ్రతాధీనో నకుర్యాన్నిశిభోజనమ్
నిషిద్ధదివసేప్రోక్తం ఛాయానక్తంమహర్షిభిః
నక్తవ్రతఫలంతేన న నక్తంనిశిభోజనమ్!!
సర్వపుణ్యప్రదెరాజన్ కార్తికేమాసియఃపుమాన్
నిషిద్ధదివసేచాన్నం భోజనంకురుతేయది
తస్యపాపస్యవిస్తారం కథం తేప్రబ్రవీమ్యహమ్!!
*తా:* కార్తీకవ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీకమాసమునందు పరాన్నము భుజించుట, పితృశేషము తినకూడని వస్తువులు తినుట, శ్రాద్ధాన్నము సేవించుట, తిలదానము గ్రహించుట ఈ ఐదూ విడువవలెను. కార్తీకమాసమమ్దు సంఘాన్నము, శూద్రాన్నము, దేవతార్చకుల అన్నము, అపరిశుద్ధాన్నము, కర్మలను విడువుమని చెప్పువాని అన్నము, విధవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమందు అమావాస్యయందు, పున్నమియందు పితృదినమందు ఆదివారమందు సూర్యచంద్ర గ్రహణములందు రాత్రిభోజనము నిషిద్ధము.  కార్తీకమాసమందు ఏకాదశినాడు రాత్రింబగళ్ళు, వ్యతీపాత వైధృతి యోగాది నిషిద్ధ దినములందు రాత్రి భోజనము చేయరాదు. మాస నక్తవ్రతము ఆచరించిన వాడు ఈ ఏకాదశికి పూర్వోత్తరదినములందును రాత్రిభుజించరాదు. అప్పుడు ఛాయానక్తభోజనము చేయవలెను కానీ రాత్రిభోజనము చేయరాదు. ఛాయానక్తమే రాత్రిభోజన ఫలమిచ్చును. కనుక రాత్రిభోజనముగూడ దినములందు కార్తీకవ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహింపవలెను ఛాయానక్తము అనగా సాయంత్రము తనశరీరమునకు రెండింతలు నీడ వచ్చినప్పుడు భోజనము చేయుట. యిదినిషిద్ధదినములలో గృహస్థులకు, ఎల్లప్పుడు యతి-విధవలకు హితము.  సమస్త పుణ్యములనిచ్చు ఈ కార్తీకమాసమందు నిషిద్ధదినములందు భుజించువారి పాపములు అనంతములగును.

తస్మాద్విచార్యయత్నేన కార్తికవ్రతమాచరేత్
తైలాభ్యంగందివాస్వాపం తథావైకాంస్యభోజనం
మఠాన్నిద్రాంగృహేస్తానం నిషిద్ధేనిశిభోజనం
వేదశాస్త్రవినిమ్దాంచ కార్తికేసప్తవర్జయేత్!!
ఉష్ణోదకేనకర్తవ్యం స్నానంయత్రైవకార్తికే
స్నానంతత్సురయాప్రోక్తం నిశ్చితంబ్రహ్మణాపురా
పటుర్భూత్వాగృహేస్నానం యః కుర్యాదుష్ణవారిణా!!
నదీస్నానం తు కర్తవ్యం తులాసంస్థేదివాకరే
కార్తికేమాసిరాజేంద్ర ఉత్తమంతంప్రచక్షతే!!
తటాకకూపకుల్యానాం జలేవాస్నానమాచరేత్
వినాగంగావినాగోదాం వినాతద్వత్సరిద్వరాం
తటాకకూపకుల్యానాం సుగంగామభివాదయేత్!!
సంప్రాప్యకార్తికంమాసం స్నానం యోనసమాచరేత్
సగచ్చేన్నరకంఘోరం చాండాలీం యోనిమాప్నుయాత్!!
గంగాదిసర్వనదీశ్చ స్మృత్వాస్నానం సమాచరేత్
తతోభివాదనంకుర్యాత్సూర్యమండలగ్ం హరిమ్
కృత్వావిష్ణుకథాందివ్యాం విప్రైస్సార్థంగృహవ్రజేత్!!
*తా:* కావున, విచారణచేసి ప్రయత్నపూర్వకముగా కార్తీక వ్రతమును ఆచరించవలెను, కార్తీకమాసమందు తైలాభ్యంగనము, పగలు నిద్ర, కంచుపాత్రలో భోజనము, మఠములలో నిద్ర, ఇంట్లో స్నానము, నిషిద్ధ దినములందు భోజనము వేదశాస్త్రనింద కూడదు. కార్తీకమాసములో శరీర సామర్థ్యము కొరకు ఇంటిలో వేడినీటి స్నానము చేయుట కల్లుతో స్నానమాచరించుట యని బ్రహ్మ చెప్పెను, శరీరపటుత్వము / ఆరోగ్యము సరి లేనివారు వేడినీటితో స్నానము చేయవచ్చు.   తులయందు సూర్యుడుండగా కార్తీకమందు నదీస్నానమే ముఖ్యము.  ఒకవేళ నది దగ్గరలో లేకున్న చెరువు, కాలువ, బావులందు స్నానము చేయవచ్చు. అప్పుడు గంగా ప్రార్థన చేసి స్నానము చేయవలెను, గంగా గోదావరి మహానదులలో స్నానము చేయునప్పుడు ప్రార్థన అవసరంలేదు. గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాక, కూపోదక స్నానము కర్తవ్యము. *కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించనివాడు నరకమందు యాతనలను అనుభవించి ఆ తరవాత ఛండాలుడై పుట్టును*. గంగాది సమస్తనదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన ఆ శ్రీహరిని ధ్యానించి హరిచరిత్రను విని ఇంటికెళ్లవలెను.


దినాంతె సర్వకర్మాణి సమాప్యవిధినానృప
పాదౌప్రక్షాళ్యచాచమ్య పూజాస్థానం ప్రవేశయేత్
పూజయేదీశ్వరంతత్ర షోడశైరుపచారకైః
పీఠస్థంపూజయేచ్చంభుం కల్పోక్తవిధినాఽనఘ
పంచామృతవిధానేన ఫలతోయైఃకుశోదకైః
స్నాపయేత్పుణ్యసూక్తైశ్చ భక్త్యాగౌరీపతింప్రభుమ్!!
తతశ్చావాహయేద్దేవం శంకరం పరమేశ్వరం
వృషధ్వజాయధ్యానంచ పాద్యంగౌరీప్రియాయచ
అర్ఘ్యంలోకేశ్వరాయేతి రుద్రాయాచమనీయకం
స్నానంగంగాధరాయేతి వస్త్రమాశాంబరాయచ
జగన్నాధాయోపవీతం గంధం కపాలధారిణే
అక్షతానీశ్వరాయేతి పుష్ఫంపూర్ణగుణాత్మనె
ధూమ్రాక్షాయేతి ధూపంవై తేజోరూపాయదీపకం
లోకరక్షాయనైవేద్యం తాంబూలం లోకసాక్షిణే
ప్రదక్షిణంభవాయేతి నమస్కారం కపాలినే!!
*తా:* పగలు చేయవలసిన వ్యాపారాదులు ఇతర పనులు చేసి, సాయంకాలము తిరిగి స్న్నము చేసి  ఆచమించి పూజాస్థానమందు పీఠముపై శంకరుని ఉంచి, పంచామృతములతోనూ, ఫలోదకముతోనూ, కుశోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారములతో పూజించవలెను.శంకరుని ఆవాహన చేసి 
అ) వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి
ఆ) గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి
ఇ) లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి
ఈ) రుద్రాయ ఆచమనీయం సమర్పయామి
ఉ) గంగాధరాయ స్నానం సమర్పయామి
ఊ) ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి
ఋ) జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి
ౠ) కపాలధారిణే గంధం సమర్పయామి
ఎ)ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి
ఏ) పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి
ఐ) ధూమ్రాక్షాయ ధూపం సమర్పయామి
ఒ) తేజోరూపాయ దీపం సమర్పయామి
ఓ) లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి
ఔ) లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి
అం) భవాయ ప్రదక్షిణం సమర్పయామి
అః) కపాలినేనమః నమస్కారం సమర్పయామి 
అని ఈ ప్రకారంగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. 


ఏతైర్యోనామభిర్భక్త్యా పూజయేద్గిరిజాపతిం
శంభోర్నామసహస్రేణ మాసమేకంనిరంతరం
పూజాం తేచార్పయేదర్ఘ్యం మాసనక్తవ్రతేనృప
*//పార్వతీకాంతదేవేశ పద్మజార్చ్యాంఘ్రిపంకజ*
*అర్ఘ్యం గృహాణదైత్యారె దత్తచేదముమాపతే//*
అర్చయేచ్ఛంకరంభక్త్యా యస్సధన్యోనసంశయః!!
*తా:* పైన చెప్పిన శంకరనామములచే పూజించి ఈ నెలయంతా శివ సహస్రనామములచేత నిత్యము పూజించి పూజావసానమందు ఈ పైన చెప్పిన శ్లోకరూప మంత్రము (" పార్వతీకాంత... ముమాపతే... ") తో అర్ఘ్యము యివ్వవలెను. ఇలా అర్ఘ్యమునిచ్చినవాడు ధన్యుడై ముక్తుడగును. అనుమానము లేదు.


తథావిత్తానుసారేణ దీపమాలార్పణం నృప
దత్వాదానంతువిప్రేభ్యో విత్తశాఠ్యంనకారయేత్!!
ఏవంవిప్రవరైస్సార్థం నక్తంయఃకార్తికవ్రతీ
కురుతేనృపశార్దూల తస్యపుణ్యఫలం శ్రుణు
అగ్నిష్టోమసహస్రాణి వాజపేయశతానిచ
అశ్వమేధసహస్రాణాం ఫలం ప్రాప్నోత్యసంశయః!!
మాసనక్తంచయఃకుర్యాదిత్యేవంవిధినానఘ
పాపమూలోద్ఘాటనంచ తమాహుర్నారదాదయః!!
మాసనక్తం మహత్పుణ్యం సర్వపాపవినాశనం
సర్వపుణ్యప్రదంనౄణాం కార్తికేనాత్రసంశయః!!
యఃకార్తికేచతుర్ధశ్యాం పితౄనుద్ధిశ్యభక్తితః
బ్రాహ్మణంభోజయేద్దేవంప్రీణంతిపితరోఽఖిలాః!!
యఃకార్తికేసితేపక్షే చతుర్దశ్యాంనరేశ్వర
ఔరసఃపితృభక్తోయ%స్తిలైస్సంగతర్పయేజ్జలే
ప్రీణంతిపితరస్సర్వే పితృలోకంగతాఅపి!!
*తా:* తన శక్తికొలది దీపమాలలను సమర్పించి శక్తివంచనలేక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడిన నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయయాగములు వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలము బొందును. కార్తీకా మాసములో ఈ ప్రకారము మాసనక్తవ్రతము ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును, సమస్తపాపములు నశించును ఇందులో సందేహములే లేవు. కార్తీకమాసమందు చతుర్దశి పితృదేవతలప్రీతికొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులు తృప్తిపొందెదరు. కార్తికమాసమమ్దు శుక్ల చతుర్దశియమ్దు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించినచో పితృలోకవాసులైన పితరులు తృప్తిపొందెదరు.



యఃకుర్యాత్ఫలదానంతు చతుర్ధశ్యాంతుకార్తికే
సతస్యసంతి తేర్హానిర్జాయతేనాత్రసంశయః!!
యఃకుర్యాత్తిలదానంతుచతుర్దశ్యాంతుకార్తికే
ఉపోష్యశంకరంపూజ్య సకైలాసేశ్వరోభవేత్!!
సర్వపాపప్రశమనం పుణ్యదం కార్తికవ్రతమ్
యఃకుర్యాత్సోపిపాపేభ్యో విముక్తోమృతమశ్నుతే!!
ఇదంపవిత్రంపరమమ్ అధ్యాయం యశ్శ్రుణోత్యతః
ప్రాయశ్చిత్తంపరంప్రాహుః పాపానాంనాత్రసంశయః!!
*తా:* కార్తీకమాసమందు చతుర్దశి నాడు ఫలదాన మాచరించువాని సంతతికి విచ్ఛేదము కలుగదు సందేహములేదు. కార్తీకమాసమందు చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించినవాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను పోగొట్టునదీ, సమస్తపుణ్యములను వృద్ధిపరచునది ఐన కార్తీకవ్రతమును చేయువాడు పాపములు నశించి మోక్షమునొందును. పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్తపాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారగుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే చతుర్దశోధ్యాయస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదునాల్గవ అధ్యాయము సమాప్తము.

Saturday, November 28, 2020

కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే త్రయోదశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం

వసిష్ఠఉవాచ
అధేధానీంప్రవక్షెహం ధర్మాన్కార్తిక సమ్భవాన్
ప్రశస్తాత్మాసవైభూప తథాచావశ్యకాంచ్ఛ్రుణు!!

తా:* వసిష్ఠుడు మరల చెప్పనారింభిచెను "  ఓ రాజా, కార్తీక మాసములో చేయదగిన ధర్మములను చెప్పదను  "స్వఛ్ఛమైన మనసుతో " వినుము ఆధర్మములన్నీ ఆవశ్యము ఆచరించవలసినవి" 

సంసారభయభీతస్య పాపభీరోర్నరస్యచ
కార్తికేమాసియత్ప్రోక్తం మత్పిత్రావిధినాపురా
సత్యంబ్రవీమికర్తవ్యాన్ నోచేత్పాపసంభవేన్నృప!!
కన్యాదానంతులాస్నానం శిష్టపుత్రోపనాయనం
విద్యావస్త్రాన్నదానాని ఊర్జెశస్తానిభూపతే!!
విత్తహీనస్య విప్రస్య సూనోశ్చావ్యుపనాయనం
సదక్షిణంసంభారం ఊర్జెదత్వానరోనఘ
తస్యపాపానినశ్యంతి కృతానిబహుళాన్యపి!!
జపేనైకేనగాయత్ర్యా ద్రవ్యదాతుఃఫలంశ్రుణు
అగమ్యాగమనాదీని హత్వాదీనిసహస్రశః
తథాన్యాన్యుగ్రపాపాని భస్మసాద్యాంతిభూమిప!!
గాయత్రీం దేవ దేవస్య పూజాస్వాధ్యాయనార్పణం
ఏతేషామధికం పుణ్యం మయావక్తుంనశక్యతె!!

తా: రాజా! కార్తీక ధర్మములు మాతండ్రియైన బ్రహ్మచే నాకు చెప్పబడినవి, అవి అన్నీ నీకు తెలిపెదను. అన్నియు ఆచరించదగినవే, అవి చేయని పక్షంలో పాపము సంభవిమ్చును. ఇది నిజము, సంసార సముద్రమునుంచి ఊరట కోరుకునేవారు నరకాది భయము గలవారు ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసములో కన్యాదానము ప్రాతస్స్నానము శిష్టుడైన బ్రాహ్మణపుత్రునికుపనయనము చేయించుట విద్యాదానము వస్థ్రధానము అన్నదానము యివి ముఖ్యము. కార్తీకమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనముచేయించి దక్షిణ యిచ్చిన యెడల అనేక జన్మార్జిత పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రి జపఫలమువలన పంచమహాపాతకములు బూదియగును. గాయత్రీజపము, దేవతార్చన, వేదగానము, వీటిఫలము చెప్పుటకు నాకు శక్యముగాదు.

తటాకాయుతనిర్మాణం అశ్వత్థారోపణంశతం
కోటయఃకూపవాపీనాం క్రమాన్నందనపాలనాత్
బ్రహ్మప్రతిష్ఠాపుణ్యస్య కలాంనార్హంతిషోడశీమ్!!
మాఘ్యాంవై మాధవేమాసి చోత్తమంమౌంజిబంధనమ్
కారయిష్యంతిరాజన్ దానందత్వాతుకార్తికే!!
సాధుభ్యశ్శ్రోత్రియేభ్యశ్చ బ్రాహ్మణేభ్యోయథావిధి
తథాతేషాంసుతానాంచ ప్రకుర్యాన్మౌంజిబంధనం
తేనానంతఫలంప్రాహుఃర్మునయోధర్మవిత్తమాః!!
తథాతేషాంవిధానంచ కార్తికేమాసిధర్మవిత్
కుర్యాత్తస్యఫలంవక్తుం కశ్శక్తోదివివాభువి!!
సోపితీర్థానుగమనం దేవబ్రాహ్మణతర్పణమ్
యంకర్మకురుతెవాపి ద్రవ్యదాతుఃఫలంలభేత్!!
మౌంజీవివాహమేకస్య యఃకుర్యాన్మేదినీపతే
దత్వార్థం కార్తికేమాసి తదనంతఫలంస్మృతమ్!!
కన్యాదానంతు కార్తిక్యాం యణుర్యాద్భక్తితోఽనఘ
స్వయంపాపైర్వినిర్ముక్తః పితౄణాం బ్రహ్మణః పదమ్!!

తా: పదివేల చెరువులు తవ్వించిన పుణ్యము, వంద రావి చెట్లు పెట్టించిన పుణ్యము, నూతులు, దిగుడుబావులు వందుకు పైగా తవ్వించు పుణ్యము, వంద తోటలు పెంచుపుణ్యము ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవ వంతుకు కూడ సరిపోవు.  కార్తీక మాసందుపనయన దానము చేసి తరవాత మాఘమాసమునకానీ, వైశాఖమునకానీ ఉపనయనము చేయించవలెను. సాధువులు శ్రోత్రియులు ఐన బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించినచో అనంతఫలముగలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనమున సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను, అలా చేసినచో కలిగెడి ఫలము చెప్పుటకు భూమిపై, స్వర్గంలో ఎవరికీ సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్ర, దేవబ్రాహ్మణులతృప్తిపరచుట చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్య దాతకే చెందును. కార్తీకమాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకుపనయనము వివాహము చేయించిన అనంతఫలము కలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించేవారు తాను పాపవిముక్తుడగును, తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తికలుగించినవాడగును.

అత్రైవోదాహరంతీమం పురావృత్తం మహీపతే
తచ్ఛ్రుణుస్సబ్రవీమ్యేవం భక్త్యామైధిలసాదరమ్!!
దావరేబాహుజఃకశ్చిద్దురాత్మావంగదేశగః
సోపినామ్నాసువీరేతి బహుశౌర్యపరాక్రమః
రాజ్ఞన్తస్యమహీపాల భార్యాబాలమృగేక్షణా!!
సోపికాలాత్తుదాయాదై ర్నిర్జితోవనమావిశత్
అర్థాంగ్యాభార్యయాసాకం విచరన్ గహనేవనే
దుఃఖేనమహతాయుక్తో నిర్థనశ్చ మహీపతిః!!
తత్రసాగుర్విణీతస్య భార్యావన్యఫలాశనా
నిర్మలేనర్మదాతీరే పర్ణశాలాం మహీపతి
తతః కాలేప్రసూతాసా కన్యకాంతత్రసుందరీమ్!!
సమరక్షయత్తతోరాజా పూర్వసౌపమనుస్మరన్
వృద్ధింగతారాజకన్యా సుకృతేన పురాకృతా
రూపలావణ్యసంపన్నా నయనోత్సవకారిణీ!!
*తా:* ఓ రాజా! ఈ విషయమై పురాతన కథ ఒకటిగలదు చెప్పెదను సావధానముగా వినుము. ద్వాపరయుగంలో వంగదేశమునందు దుష్టుడైన సువీరుడను ఒక క్షత్రియుడుండెడివాడు. వానికి జింకకన్నులు చూపుల వంటి చూపుగల ఒక స్త్రీ అతనికి భార్యగానుండెను. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగమున దాయాదులచేత జయింపబడి రాజ్యభ్రష్టుడై భార్యను తీసుకొని అరణ్యమునందు జీవించుచు చాలా దుఃఖమునొందెను. ఆ అరణ్యమునందు రాజు భార్యయు కందమూలాదులను భక్షించుచు కాలమును గడుపుచుండెను. ఆ విధముగా జీవనము చేస్తుండగా ఆమె గర్భవతియయ్యెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాల నిర్మించి వారు ఉండసాగెను, ఆ పర్ణశాలయందు ఆ సుందరి ఒక కూతురిని కనెను. రాజు అరణ్యనివాసము, వనములో దొరుకు ఆహారము ఆసమయంలో సంతానసంభవము కలుగగా సంతాన పోషణకు ద్రవ్యము లేకపోవడం అన్నీ తలచుకుని తన పురాకృతమైన పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. కొంకాలమునకు పూర్వపుణ్యవశము చేటా ఆ బాలిక వృద్దినొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ అలరారి చూచువారికి నేత్రానందము కలిగించుచునదాయెను.

అష్టవర్షాంమనోరమ్యాం దృష్ట్వాకశ్చిన్మునేస్సుతః
వివాహార్థంమతించక్రే సువీరంసమయాచత!!
తతోవాచతతస్సోపి దరిద్రోహంమునేస్సుత
ద్రవ్యం దేహియధోద్ధిష్టం ఉద్వాహంయదికాంక్షసే!!
ఇతి భూపవచశ్శ్రుత్వా కన్యాసంసక్తమానసః
మునిసూనురువాచేదం రాజానం మిధిలేశ్వర!!
దాస్యామిద్రవిణభూరి రాజన్ తేహంతపోబలాత్
తేనతెరాజ్యసౌఖ్యాని భవిష్యంతి న సంశయః
ఇతిశ్రుత్వావనెరాజా ఓమిత్యాహముదాన్వితః!!
తపశ్చచారతత్తీరే మునిసూనురుదారధీః
తత్రరాజన్బలాద్ద్రవ్యం సమాకర్ష్యహ్యతంద్రితః
తత్సర్వమర్థంనృపతేః ప్రదదేమునిపుత్త్రకః!!
గృహీత్వార్థంవసూన్ రాజా హర్షాల్లబ్ధమనీరధః
వివాహమకరోత్కన్యాం మునేస్తాపసజన్మనః
స్వగృహ్యోక్తవిధానేన కన్యాముద్వాహద్వనేః!!

తా: ఆచిన్నదానికి యుక్త వయస్సు వచ్చినది, మనస్సుకు బహురమ్యముగా ఉన్నది, యిట్లున్న కన్యకనుచూసి ఒక మునికుమారుడు సువీరా నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆ మాటవిని ఆ రాజు, నాకూతురిని మునికుమారునికా అని ఆలోచించి, నేను దరిద్రుడను కాబట్టి నేను కోరినంత ధనమిచ్చిన నా కన్యకామణిని నీకిస్తానని చెప్పెను. ఈ మాటవిని ఆకన్యయందు కోరికతో ఆ ముని కుమారుడు సరేయని ఒప్పుకొనెను.  ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదిమ్చి బహుద్రవ్యమును నీకిచ్చెదను దానితో నీవు సుఖముగానుండు అని చెప్పి ఆవిధముగానే చేసెను. తరవాత ఆ ముని కుమారుడు నర్మదా తీరమున తపమాచరిమ్చి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును రాజునకిచ్చెను. ఆ రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తన కూతురిని ఆ మునికుమారునకిచ్చి తన గృహ్యసూత్రప్రకారముగ పెండ్లి చేసెను.

సవోఢాసాపితత్పార్శ్వం జగామమనుజేశ్వర
కన్యాద్రవ్యేణనిత్యం వై హ్యభూత్సోదరపోషకః!!
పునస్సువీరభార్యాసా ప్రజజ్ఞేకన్యకాంతథా
ద్వితీయాంతనుజాందృష్ట్వా పునర్లబ్ద్వాముదాన్వితః
ఇతఃవరంయధేష్టంమె ద్రవ్యంభూరిభవిష్యతి!!
ఏవం విచిమ్త్యమానేతు పుణ్యేనమహతానృప
అజఆమయతిఃకశ్చిత్స్నానార్థం నర్మదాంప్రతి
పర్ణశాలాంకణీభూపం సభార్యమవలోకయత్!!
తమువాచకృపాసింధుర్యతిఃకౌండిన్యగోత్రజః
కిమర్థమత్రకాంతారేకోభవాన్ వదసాంవ్రతమ్!!
ఏవంబ్రువంతమాహేదం భూపాలంకరుణానిధిం
రాజాహంవంగదేశీయ స్సువీర యితివిశ్రుతః
రాజ్యార్థం తైశ్చదాయాదైర్నిర్జితోస్మివనంగతః!!

తా: ఆ కన్యయు వివాహముకాగానే భర్తవద్దకు చేరెను. రాజు కన్యావిక్రయద్రవ్యముతో తాను తన భార్యయు సుఖముగా జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి ఈ సారి కన్యను విక్రయించి చాలా ద్రవ్యమును పొందెఅదని తలచి దానితో ఆజన్మాంతము గడచునని భావించెను. రాజట్లు తలచగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికి వచ్చి పర్ణశాలయందున్న రాజును, భార్యను వారి కూతురుని చూచెను. కౌండిన్యసగోత్రుడైన ఆ ముని దయతో వారిని జూచి ఓయీ నీవెవ్వరవు ఈ అరణ్యమున ఏమిజేయుచున్నావు అని అడిగెను. యతి ఇట్లడిగిన మాటవిని రాజు చెప్పుచున్నాడు, అయ్యా నేను వంగదేశమును పాలించుచున్న రాజును నాపేరు సువీరుడు నాదాయాదులు రాజ్యకాంక్ష చేత నన్ను జయించి నారాజ్యమును అపహరించిరి నేని ఈ వనమును చేరి నివసించుచున్నాను

నదారిద్ర్యసమందుఃఖం నశోకఃపుత్రమారణాత్
నచవ్యధానుగమినేన వియోగః ప్రియావహాత్
తస్మాత్తేనై వదుఃఖేన వదవాసంకృతం మయా
శాకమూలఫలాద్యైశ్చ కృతాహారోస్మికాననే!!
కాంతారేస్మిన్తతోజాతా పర్ణగారేతుకన్యకా
తాంప్రాప్తయౌవ్వనాందృష్ట్వా కస్మైవిప్రసుతాయచ
తస్మాద్భూరిధనం విప్ర గృహీతం యన్మయానఘ
నివసామిసుఖంత్వస్మిన్ కిమత్రశ్శోతుమిచ్చసి!!
ఇతిభూపవచశ్శ్రుత్వా పునరాహయతిస్తదా
మూఢవత్కురుషేరాజన్ మహాపాతకసమ్చయమ్!!
కన్యాద్రవ్యేణయోజీవే దసిపత్రంసగచ్ఛతి
దేవాన్ ఋషీన్ పితౄన్ క్వాపి కన్యాద్రవ్యేణతర్పయేత్
శాపందాస్యంతి తేసర్వే జన్మజన్మస్యపుత్రతామ్!!
యఃకన్యాద్రవ్యకలుషాం గృహీత్వావృత్తిమాశ్రయేత్
సోశ్నీయాత్సర్వపాపాని రైరవం నరకం వ్రజేత్!!
సర్వేషామేవపాపానాం ప్రాయశ్చిత్తంవిదుర్భుధాః
కన్యావిక్రయశీలస్య ప్రాయశ్చిత్తంనచోదితమ్!!

తా: దారిద్ర్యముతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్యావియోగముతో సమానమైన వియోగదుఃఖము లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాకమూల ఫలాదులు భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమమ్దు పర్ణశాలలో నాకు కుమార్తెపుట్టినది, దానిని యౌవ్వనము రాగానే ఒక మునికుమారునికి బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ద్రవ్యముతో సుఖముగా జీవించుచున్నాను. ఇలా రాజు చెప్పగా విని ఆ యతి ’ రాజా! ఎంత పని చేసితివి మూఢుని వలె పాతకములను సంపాదిమ్చుకొంటివికదా! కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమున అసిపత్రవనమనునరకమందు నివసిమ్చును. కన్యాద్రవ్యముచేత దేవఋషి పితరులను తృప్తిచేయుచున్నవానికి వారి ప్రతిజన్మమునందు ఇతనికి పుత్రులు కలుగరని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయుపాపాత్ముడు రౌరవనరకమును బొందును. సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్ననూ కన్యావిక్రయపాపమునకు ప్రాయశ్చిత్తము ఎక్కడా చెప్పబడలేదు.

కార్తికే శుక్లపక్షేతు ద్వితీయాంకన్యకాంతవ
కన్యాదానం కురుష్వత్వం సహిరణ్యోదకేనచ!!
విజ్ఞాయతేజోయుక్తాయ శుభశీలాయధర్మిణే
కన్యాదానంతుయఃకుర్యాత్కార్రిక్యామ్చశుభేదినే
గంగాదిసర్వతీర్థేషు స్నానదానేనయత్ఫలం!!
అశ్వమేధాదభిర్యాగై రుక్తదక్షిణసంయుతైః
యత్ఫలంజాయతేరాజన్ తత్ఫలంసోపిగచ్చతి!!
ఇత్యేవంగదితంశ్రుత్వా రాజారాజకులేశ్వర
యతింధర్మార్థతత్వజ్ఞం బాహుజఃకృపణోబ్రవీత్!!
కుతోలోకఃకుతోధర్మః కుతోదానం కుతఃఫలః
సుఖభోగైర్వినావిప్రదేహేస్మిన్ సుఖకాంక్షిణీ
పుత్రదారాదయస్సర్వేవాసోలంకరణానిచ
గృహక్షేత్రాణిసర్వాణి దేహాద్యాధర్మసాధనం
ద్వితీయాం మేదుహితరం యోద్రవ్యమ్ భూరిదాస్యతి
తస్యదాస్యేన సందేహః విప్రగచ్ఛయథాసుఖమ్!!

తా: కాబట్టి, ఈ కార్తీక మాసమమ్దు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురును కన్యాదానపూర్వకముగా వివాహము జరిపించుము. కార్తికమాసమందు చేసెడి విద్యాతేజశ్శీలయుక్తుడైన వరునకు కన్యాదానం చేసినవాడు గంగాది సమస్తతీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలము యధోదక్షిణసమేతముగా అశ్వమేధాది యాగములు చేసినవాడు పొందెడి ఫలము బొందును. అని ఈ విధముగా ఆ యతి చెప్పినది విని రాజు ఆ సకలధర్మవేత్తయైన ఆ మునితో యిట్లనెను. బ్రాహ్మణుడా ఇదేమిమాట పుత్రదారాదులు గృహక్షేత్రాదులు వాసోలంకారములున్నందుకు దేహమును సుఖబెట్టి భోగింపవలె, కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమేమిటి, పాపలోకమేమిటి? ఏదో విధంగా ధనం సంపాదించి భోగించుట ముఖ్యము. నా యీ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చినవానికి యిచ్చి ఆ ద్రవ్యముతో సుఖ భోగములననుభవించుచూ జీవించెదను. నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము.

తతోయయౌనర్మదాయాం స్నానార్థంనృపపుంగవ
నృపస్యాస్యగతేకాలే కాంతారేమరణుగతః!!
ఆయయుర్యమదూతాశ్చపాశైరాబధ్యపాపినం
యమానుగాదక్షిణాశాంతతోజగ్ముర్యధాగతమ్!!
తత్రతంసమ్యగాలోక్యయమస్తామ్రారుణేక్షణః
నరకేషువిచిత్రేషు బబాధరవినంధనః
తథాసిపత్రెఘోరేచ పితృభిస్సహపాతయత్!!
సువీరస్యాస్వయెకశ్చిచ్చృతకీర్తిర్మహీపతిః
సర్వధర్మాంశ్చ కారాసౌతధాక్రతుశతానిచ
ప్రచకారస్వకంరాజ్యం ధర్మేణమిధిలేశ్వర
పశ్చాత్స్వర్గంసమాసాద్య సేవ్యమానస్సురేశ్చరై!!
సువీరః కర్మశేషేణ పితృభిర్నరకంగతః
తత్రవ్యచింతయద్ధుఃఖాద్యాతనాహేతుమాత్మనః
పూర్వపుణ్యప్రభావేన యమంప్రాహాతినిర్భయః

తా: ఆమాటవిని యతి స్నానము కొరకు నర్మదానదికి వెళ్ళిపోయెను, తరవాత కొంతకాలమునకు ఆ అడవిలో సువీరుడు చనిపోయెను. అంత యమదూతలు పాశములతో సహా వచ్చి రాజునుగట్టి యమలోకమునకు తీసుకుపోయిరి. అక్కడ యముడు వానిని జూచి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్రమనందు రాజును రాజుపితరులను గూడ పడవేసెను. (అసిపత్రవనము = కత్తులే ఆకులుగాగల దట్టమైన అడవి). ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తియనే వాడొకడు సమస్త ధర్మములను చేసి వందయాగములన్ చేసి ధర్మముగా రాజ్యపాలనము చేఇస్ స్వర్గముబోయి యొంద్రాదులచేత కీర్తింపబడెను. ఈ శ్రుతికీర్తి సువీరుని పాతకవిశేషముల చేత స్వర్గమునుంచి తాను నరకమందు బడి యమయాతనలను పొందుచు ఒకనాడు ఇదేమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుంచినారేమని విచారించుకుని ధైర్యముతో ఆయమునితో ఇట్లనెను.

వాక్యంమెశ్రుణుసర్వజ్ఞ ధర్మరాజమహామతే
పాపలేశవిహీనస్య కిమియందుర్గతిర్మమ
సర్వధర్మావృధాయాంతి ప్రోక్తాఃపూర్వమహర్షిభిః
దివ్యంవిహాయనరకాగమనంచనసాంప్రతమ్!!

తా: సర్వమును తెలిసిన ధర్మరాజా! నామనవి వినుమయ్యా,, ఎంతమాత్రము పాపము చేయని నాకు ఈ నరకమెట్లు సంభవించినది. అయ్యో మహా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్ని పాటించిననూ వృధాయయ్యేఖాడ, స్వర్గమందున్న నాకు నరకమెట్లు కలిగినది?

ఇతిశ్రుత్వాయమఃప్రాహశ్రుతకీర్తి సహామతిం
అస్తికశ్చిద్దురాచారో వంశజస్తుతవాద్యవై!!
సోపినామ్నానువిరేతి కన్యాద్వవ్యేణజీవితం
తేనపాపేనపితరః పుణ్యలోకంగతా అపి
దివశ్చ్యుతాభవంతీహ దుష్టయోనిషుభూతలే!!
ద్వితీయాతనుజాతస్య వర్ధతేమాతృసన్నిధౌ
పర్ణాగారెనృపశ్రేష్ఠ నర్మదాయాస్తటేవనే!!
మత్ప్రసాదాద్భువంగచ్ఛ దేహేనానేనచానఘ
తత్రతిష్ఠంతిమునయస్తేషామేతన్నివేదయ
కన్యాంతాంశ్రుతశీలాయ కార్తికేమాసిభక్తితః 
కన్యాదానంకురుష్వత్వమ్ సహిరణ్యోదకేనచ!!
సర్వాభరణసంపన్నాం యః కన్యాంకార్తికేనఘ
ప్రయచ్ఛతివిధానేన సోపిలోకేశ్వరోభవేత్!!

తా: శ్రుతకీర్తి మాటలు విన్న సమవర్తి చెప్పెను, ’ ఓ శ్రుతకీర్తీ, నీవన్నమాట సత్యమే, కానీ నీ వంశస్థుడైన సువీరుడనువాడొకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు. ఆపాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్తులైనను నరకమందు పడిపోయిరి. ఆ తరవాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ! ఆ సువీరునికి రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లితో కలిసి పర్ణశాలయందున్నది, ఆమెకింకనూ వివాహము జరుగలేదు. కాబట్టి నీవు నాప్రభావము వలన ఈ దేహముతో అక్కడికి పోయి అక్కడనున్న మునులతో ఈ మాటను చెప్పి ఆకన్యను యోగ్యుడైన వరునకుయిచ్చి కార్తీకమాసమున కన్యాదాన విధానముగా పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తయైన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతియగును. 

యతికన్యానజాయేత మౌల్యంవాయఃప్రయచ్ఛతి
దాతుర్గోమిధునం మౌల్యం కన్యాదానంతదుచ్యతె
కన్యాదానఫలంతస్య భవిష్యతినసంశయః!!
కురుత్వం ద్రాక్చవిప్రేభ్యః కన్యామూల్యమ్విధానతః
ప్రీణమ్తిపితరస్సర్వే ధర్మేణానేనసంతతమ్!!
శ్రుతకీర్తిస్తధేత్యుక్త్వా యమంనత్వాగృహంగతః
నర్మదాతీరసంస్థాంచ కన్యాంకనకభూషణాం
కన్యదానంతుకార్తిక్యాం చకారాసౌనృపోత్తమః
కార్తికేశుక్లపక్షేతు విధినేశ్వరతుష్టయే!!
తేనపుణ్యప్రభావేన సువీరో యమపాశతః
విముక్తస్స్వర్గమాసాద్య సుఖేనపరిమోదతే!!
తథైవదశవిప్రేభ్యః కన్యామూల్యందదావసౌ
ప్రయాంతి పితరస్సర్వే పుణ్యలోకం మహీపతే
పాపానియానిచోగ్రాణి విలయంయాంతితత్క్షణాత్
తతస్స్వర్గగతోరాజా శ్రుతకీర్తిర్యథాగతమ్!!
యస్తస్మాత్కార్తికేమాసి కన్యాదానం కరిష్యతి
హత్యాదిపాతకై స్సర్వై ర్విముక్తోనాత్రసంశయః!!
వాణ్యానాసులభంయేపి వివాహార్థం నగేశ్వర
సహియంయేప్రకుర్వంతి తేషాంపుణ్యమనంతకమ్!!
యఃకార్తికేప్రనిష్ఠో విధినాతత్సమాచరేత్
సయాతివిష్ణుసాయుజ్యం సత్యంసత్యంమయోదితం
నాచరేద్యదిమూఢాత్మా రౌరవమ్తుసమశ్నుతె!!
*తా:* అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఆ ధనదాతయూ లోకాధిపతియగును, కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యను తీసుకుని వరునకు యిచ్చి వివాహము చేసినయెడల కన్యాదాన ఫలమునొందును. కాబట్టినీవు వెంటనే పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము యిమ్ము దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సుఖముపొందుదురు.  శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేయని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యకు సువర్ణాభ్హరణభూషితగా చేసి కార్తీకశుక్లపక్షమునందు ఈశ్వరప్రీతిగా విధ్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆపుణ్యమహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుపోయి సుఖముగాయుండెను. తరవాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును యిచ్చెను దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పొయిరి. తానూ యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీకమాసమున కన్యాదాన మాచరించేవాడు విగతపాపుడగును అందులో సందేహము లేదు. కన్యామూల్యమును యివ్వలేనివాడు మాటతోనైనా వివాహ సహాయమును చేసిన వాని పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరిమ్చువాడు విష్ణుసాయుజ్యమును పొందును. ఇది నిజము, నామాటనమ్ముము ఈ విధముగా కార్తీకవ్రతమాచరించనివారు రౌరవాది నరకములను బొందుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే త్రయోదశోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదమూడవ అధ్యాయము సమాప్తము

కార్తీక పున్నమి తిధి నిర్ణయం

ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.09 నిమిషాల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2.03 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం....దీనిని మిగులు...తగులు... అని అంటారు
సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం...రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది...అంటే దీపావళిని  ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి...

అదేవిధంగా పౌర్ణమి కూడా, రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే....

ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే... ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి...

కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారు. 
నక్షత్ర గమనం ప్రకారం కూడా... ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది . 
ఆ విధంగా పౌర్ణమి తిధితో... కృత్తిక నక్షత్రం సోమవారం ఉదయం 6:06 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది...

కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన... ఆదివారం మాత్రమే జరుపుకుని తీరాలి...

మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి  జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు... కృష్ణపక్షం వచ్చేస్తుంది...

ఉపవాస నియమం ఉన్న... ఉండాలనుకునే వారు మాత్రం 29వ తేదీ ఉపవాస నియమాలు పాటించి...రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని , చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు...

ఉపవాస నియమం లేని వారు..
దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ ఉదయం ఆరు గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు...

30వ తేదీ సోమవారం కూడాను....మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది... కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 30వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి...ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును...

అదేవిధంగా నోములు , తోరాలు ఉన్నవారు కూడా 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు... పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి 29వ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు , వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు...