Translate

Thursday, March 21, 2019

హోలీ పండగ (సేకరణ- ఈనాడు పేపర్ నుండి)





హోలీ... రంగుల పండగ... ఉగాదికి కాస్తముందు... వసంతం ఆగమించిన శుభవేళ...  రకరకాల వర్ణాలను వెదజల్లుకుంటూ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ... అంతేనా... ఈ పండగ మనిషిలోని వికారాలను దూరం చేసుకోమంటుంది... కల్మషాలను కడిగేయమంటుంది... అంతరంగాన్ని వర్ణశోభితం చేసుకోమంటుంది.. ఈ అద్భుతమైన పర్వదినానికి నేపథ్యంగా వివరించే కథలు అదే విషయాన్ని చెబుతాయి...

ఏవిధమైన రంగులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. మన ఆలోచనలు స్పష్టంగా ఉండాలన్నా, దానికి అనుగుణంగా బుద్ధి ప్రతిస్పందన కలిగి మనం ఒక పని చేయాలన్నా అందుకు కారకంగా నిలిచేవి రంగులు. దూరంగా కనిపించే మంటల్లోని ఎర్రటిరంగు అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అంచనా కలిగిస్తుంది. అందుకు అనుగుణంగా మనసు ప్రతిస్పందిస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్న పూలగుత్తులు... వాలుతున్న మొక్కలు మనసును తేలికపరుస్తాయి. మోడుగా మిగిలిన చెట్టును చూడగానే విషాదభావన కలుగుతుంది. ఇలా... ఏ అంశాన్ని చూసినా మనకు మరుక్షణంలోనే ఓ మనస్థితి కలుగుతుంది. నిజానికి ఆ సన్నివేశం కన్నా, దాన్ని ప్రకటించిన రంగు మన మనస్సు మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఆ రంగువల్లే ఆ సంఘటన తీవ్రత మనకు అర్థమవుతుంది.


* దుర్గాదేవి పసుపు వర్ణంతో ప్రకాశిస్తుంది. కాళికాదేవి ముదురు నీలం రంగులో ఉంటుంది. సరస్వతీదేవి తెల్లని వర్ణంతో స్వచ్ఛమైన ముత్యపురంగులో ప్రకాశిస్తుంది. ఇలా.. ఒక్కో దేవతను స్మరించుకోగానే ఒక్కోరంగు మనసులో ప్రత్యక్షమవుతుంది. దేవుడు లేదా దేవతను ఆ రంగులోనే మనం భావన చేస్తాం. మరో రంగులో ఆ దేవతను పోల్చుకోలేం. ఆకాశపు రంగు నీలం. ఆకాశానికి విశ్వమంతటా వ్యాపించి ఉండే లక్షణం ఉంది. దూరం నుంచి చూస్తే సముద్రం కూడా నీలం రంగులో కనిపిస్తుంది. సముద్రం అనంతం అనే భావనకు ప్రతీక. ఇలా సర్వవ్యాపక లక్షణాలు కలిగిన నీలపురంగులో రాముడు ఉన్నాడు. రామ, కృష్ణులిద్దరూ మహావిష్ణు అవతారాలు. వారిద్దరిలోని సర్వవ్యాపకత్వాన్ని నీలం రంగు వ్యక్తం చేస్తుంది.  ఇలాగే దేవతలందరూ. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో రంగు సంబంధించి ఉంటుంది. ఆ రంగులన్నీ ఆయా దేవతల స్వభావాన్ని ప్రకటిస్తాయి. జగన్మాత స్వరూపాలూ అంతే...

అన్నపూర్ణాదేవి - ఎరుపు
లక్ష్మీదేవి - బంగారు 
సరస్వతి - తెలుపు
కాళి - ముదురు నీలం
దుర్గాదేవి - పసుపు
మహిషాసురమర్ధని - ఎరుపు
రాజరాజేశ్వరీదేవి - పసుపు
బగళాముఖి - బంగారు 
శాకంబరి - మిశ్రమ  వర్ణం


* మనిషి నడవడిక, ఆలోచన, వ్యవహారం, దైనందిన జీవితం, భవిష్యత్తు అన్నీ ఆయా గ్రహాల సంచారం మీదే ఆధారపడి ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అందుకే, నవగ్రహాల ఆరాధన, జపం, దానాలు తప్పనిసరిగా చెయ్యాలని సూచిస్తుంది. వీటితోపాటు ప్రత్యేకంగా ఆయా గ్రహాలకు ప్రతీకలుగా కొన్ని రంగుల్ని కూడా పేర్కొంది.  పూజా సమయంలో ఏ గ్రహానికి అర్చన చేస్తున్నామో దానికి సంబంధించిన రంగు వస్త్రాన్ని ధరించాలని పండితులు చెబుతారు. దీనివల్ల ఆ గ్రహాధిదేవతకు తృప్తి కలుగుతుంది. ఆయా గ్రహాలకు సంబంధించిన రంగుల్లో ఉండే ముత్యం, వజ్రం, కెంపు, పగడం వంటి రత్నాలను ఉంగరాల్లో ధరించాలని కూడా జ్యోతిష్కులు చెబుతారు. ఇవన్నీ ఆయా రంగులతో ముడిపడి ఉన్న భావనల్ని ఆ వ్యక్తి మనసుల్లో తీవ్రతరం చెయ్యటం లేదా మందగింపజేయటం కోసం ఉద్దేశించినవే.

సూర్యుడు - ఎరుపు
చంద్రుడు - తెలుపు 
కుజుడు - ఎరుపు
బుధుడు - ఆకుపచ్చ 
గురుడు - పసుపు 
శుక్రుడు - తెలుపు
శని - నలుపు 
రాహువు - తేనెరంగులో ఉండే నలుపు 
కేతువు - చిత్రవర్ణం


* ‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః’ - నిరంతరం మననం చెయ్యటం వల్ల మనల్ని రక్షించేది మంత్రం అని అర్థం. నిరంతరం మననం అంటే త్రికరణశుద్ధిగా ఒక పని మీద లక్ష్యాన్ని ఏర్పరచుకుని సాధన చెయ్యటమే అవుతుంది. అటువంటి సాధనకు మనస్సు చాలా ముఖ్యం. ఆ సమయంలో కంటితో చూసే దృశ్యం , ధరించిన వస్త్రాల రంగులు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. ఏ కోరికతో అయితే మంత్రాన్ని జపిస్తున్నామో ఆ కోరికను మరింతగా ఉద్దీపనం చేస్తాయి.  మంత్రోపాసనలో రంగువస్త్రాలను నిర్దేశించటంలో అంతరార్థం ఇదే. వారాహి, ధూమావతి, దక్షిణకాళి మొదలైన మంత్రాలను ఉపాసన చేసే సందర్భంలో కూడా కొన్ని రంగుల వస్త్రాలు ధరించాలని తంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.

అందుకే ఆ శిక్ష...
ధర్మార్ధకామమోక్షాలను చతుర్విధ పురుషార్థాలంటారు. ఇవన్నీ మానవుడు సాధించాల్సినవి. ఇందులో కామం కూడా ఒకటి. మరోవైపు కామక్రోధమోహలోభమదమాత్సర్యాలను అరిషడ్వర్గాలుగా చెప్పారు. అంటే శత్రుకూటమి అని అర్థం. ఈ కూటమికి నాయకత్వం వహించేది కూడా కామమే. మరోవైపు తన విభూతుల్లో ఒకటిగా కామాన్ని పేర్కొన్నాడు భగవానుడు. మరి కామంపై అభిప్రాయాల్లో ఎందుకింత విభిన్నత అంటే... ఇక్కడ మనం ధర్మకామాన్ని గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ధర్మాన్ని అనుసరించిన కామం ఎప్పుడూ వాంఛింపదగింది. అదే అధర్మంతో కలిస్తే అది మనిషి పాలిట శత్రువవుతుంది. కాబట్టి అలాంటి కామాన్ని విసర్జించమంటాయి ధర్మశాస్త్రాలు. మనకు కుమారసంభవంలో కనిపించేది కూడా అదే.పార్వతీదేవిని వివాహం చేసుకోవాలనే కోరికను శివుడికి కల్పించాలనే లక్ష్యంతో మన్మథుడు శివుడిపై తన బాణాలు ప్రయోగిస్తాడు. దీంతో ఆగ్రహించిన శివుడు తన మూడోకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. తన భర్త మరణానికి దుఃఖిస్తూ మన్మథుడి భార్య రతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది. కరుణించిన శివుడు అతణ్ణి బతికించి, కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చి, ఆమెలో వసంతాన్నిచిగురింపజేస్తాడు. తీవ్ర తపస్సులో మునిగి ఉన్న శివుడిపైకి మన్మథబాణాలు అవాంఛనీయాలు. ఆయన మనస్సుపై జరిగిన దాడి అది. అందుకే పరమేశ్వరుడు కామానికి ప్రతీక అయిన మన్మథుడిని తన చూపుల వేడితో భస్మం చేస్తాడు. అదే సమయంలో పునరుత్పత్తికి, తద్వారా సృష్టికి కారణమై లోకానికి అత్యంత ఆవశ్యకమైన అతడిని కరుణించి కాపాడాడు. మన్మధుడికే కాముడనే పేరు ఉంది. కాముడు దహనమైన రోజు కాబట్టి ఈ రోజుకు ‘కామదహనం’ అనే పేరు వ్యాప్తిలోకి వచ్చింది. ఆరోజునే హోలీ చేసుకుంటారని చెబుతారు. ఇక్కడ ధర్మకామం అనుసరణే హోలీ సందేశం.

ఆ అయిదు బాణాలు...
మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. ఆయన మహావిష్ణువుకు మానస పుత్రుడు. చెరుకు గడను విల్లుగా ఉపయోగిస్తాడు. అరవిందం (తామర పువ్వు), అశోకం (అశోక వృక్షం పువ్వు), చూతం (మామిడి పువ్వు), నవమల్లిక (అప్పుడే విరిసిన మల్లెపువ్వు), నీలోత్పలం (నల్ల కలువ) అనే అయిదు పుష్పాలు ఆయన వాడే బాణాలు.

ఆయనను మర్చిపోయావా?
భక్తి అనే అగ్నిలో లౌకిక సుఖభోగాలనే అవివేకాన్ని దగ్ధం చెయ్యటానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందన సందేశాన్నిస్తూ ఓ వృత్తాంతం వ్యాప్తిలో ఉంది. ఉజ్జయినీ నగరంలో నివసించే వసంతిక అప్సరసలను మించిన సౌందర్యవతి.  యుక్తవయస్సు రాగానే ఆమెతో పోటీపడే అందగాడైన వరుడితో వివాహం జరిపిస్తారు తల్లిదండ్రులు. మితిమీరిన సౌందర్యగర్వంతో భర్తతో సుఖభోగాలను అనుభవిస్తూ, వంశపారంపర్యంగా వచ్చే శివపూజను విస్మరిస్తుంది వసంతిక. తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెడుతుంది. పరమేశ్వరుడే ఆమెకు కనువిప్పు కలిగించాలని ప్రార్థిస్తారు తల్లిదండ్రులు. వసంతికకు జ్ఞానోదయం కలిగించటానికి పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమె ఇంటికి వస్తారు. తాను ఊరువెళ్తున్నానని, తిరిగి వచ్చేవరకు వృద్ధుడైన తన భర్తను జాగ్రత్తచూడమని వసంతికను అడుగుతుంది వృద్ధురాలు. సరేనంటుంది వసంతిక. కానీ, తన దైనందిన సుఖభోగాల విషయంలో పడి వృద్ధుడి సంగతి మర్చిపోతుంది. సరిగ్గా వృద్ధురాలు వచ్చేసరికి మాయా వృద్ధుడు మరణిస్తాడు. సుఖభోగాల్లో తేలుతూ తన భర్తను పట్టించుకోకపోవటం వల్లే అతడు మరణించాడని, ఇందుకు వసంతికే బాధ్యత తీసుకోవాలంటుంది వృద్ధురాలు. తన వల్లే పొరపాటు జరిగిందని అంగీకరించి, జరిగిన దానికి చింతిస్తూ చితిని పేర్చుకుని అôదులో దహనమయ్యేందుకు సిద్ధపడుతుంది వసంతిక. ఆమెలో వచ్చిన మార్పును గమనించిన పార్వతీపరమేశ్వరులు నిజరూపంతో సాక్షాత్కరించి, ఆమె పేర్చుకున్న చితిని పూలపాన్పుగా మారుస్తారు. సుఖభోగాలు అనుభవించాల్సినవే కానీ ఆ మాయలోపడి దైవపూజను విస్మరించటం తగదని, క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన దైవపథాన్ని వదులుకోవటం అవివేకమని వసంతికకు హితబోధ చేస్తారు ఆది దంపతులు. తన తప్పును మన్నించమని ప్రార్థించిన వసంతికను ఆశీర్వదించి, వారు అంతర్థానమవుతారు.

ఎక్కడున్నా తప్పించుకోలేదు...
హోలిక అనే రాక్షసి దహనమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని హేమాద్రికాండ, భవిష్యత్‌ పురాణం, ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి. వీటి ప్రకారం హిరణ్యకశిపుడి సోదరి హోలిక. కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పరాయణుడు కావటంతో ఆగ్రహించి, అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా ఉంటాడు. చివరకు హిరణ్యకశిపుడు ఓ ఉపాయం ఆలోచిస్తాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల అతని సోదరి హోలికకు ఓ పైవస్త్రం లభిస్తుంది. ఎంతటి భయంకరమైన అగ్ని అయినా వస్త్రం ధరించిన వారిని ఏమీ చెయ్యదు. హోలికను ఆ వస్త్రాన్ని ధరించమని చెప్పి, ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి, తన భటుల చేత నిప్పు అంటింపజేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ చేత హోలిక కప్పుకున్న ఆ వస్త్రం గాలికి ఎగిరిపోయి, ఆమె దగ్ధమవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈవిధంగా హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు. దైవభక్తిముందు ఎటువంటి మాయోపాయాలు పనిచెయ్యవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని ఈ వృత్తాంతం అందిస్తుంది.

- కె.రామకృష్ణ

Tuesday, March 19, 2019

గీతాపారాయణం (సేకరణ- ఈనాడు పేపర్ నుండి)





అనిశ్చితి మనసంతా ఆవరించి ఉన్నప్పుడు మనిషి బుద్ధికి ధర్మాధర్మాలు విచక్షించుకోగల శక్తి ఉండదు. కురుక్షేత్ర రణరంగంలో, యుద్ధసన్నద్ధుడై ఉన్న అర్జునుడికి ఎదురైనది అదే పరిస్థితి. ఆ సందర్భంలో భగవంతుడి నోటివెంట వెలువడిన కర్తవ్యబోధనల ఆవిర్భూతమే భగవద్గీత.

భగవద్గీత... అనిశ్చితిని అధిగమించడమెలాగో చెప్పడంతో ఆరంభమై, పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల పైచిలుకు శ్లోకాల్లో, సుఖదుఃఖాలు, భయాలు, రాగద్వేషాల గురించి మనిషికి విశదీకరిస్తుంది. ముందుగా సృష్టి, సృష్టికర్తలిద్దరూ ఒకరేనని అతడికి తెలియాలంటుంది. ఆత్మవిచారంతోనే అది అర్థమవుతుందని, అందుకతడు ఆధ్యాత్మిక సాధనలతో స్థితప్రజ్ఞుడు కావాలంటుంది. స్థితప్రజ్ఞుడైనప్పుడే జననం, మరణం ఆ తరవాత జరిగేదేమిటన్న విషయాలపై స్పష్టత తెచ్చుకుని- తానెవరో, తానెవరు కాదో తెలుసుకుంటూ, కాలాతీత నిరాకార నిర్గుణ బ్రహ్మమైన భగవంతుడితో పునరేకీకరణ పొందగలడంటుంది.

భౌతిక జీవితమే సర్వస్వం అనుకునే మనిషికి, ఆ ఆలోచన సరికాదని భగవద్గీత సహేతుకంగా చెబుతుంది. అతడి మేధస్సు అందుకోలేని విశ్వస్వరూపం, జ్ఞానస్వరూపం, పరమాత్ముడి రూపం వంటి అంశాలపై సులభగ్రాహ్యమైన శాస్త్రీయత గోచరించే వివరణలిస్తుంది. సిద్ధాంత రూపంలో భగవంతుడే అందించి, అవి ఆచరించటం ఎలాగో ఆయనే చెప్పిన, ఆధ్యాత్మిక సాధనల ప్రస్తావనే గీతఅంతటా కనిపిస్తుంది.

గీత చెప్పే ఆ యోగమార్గాలన్నీ ఆత్మచైతన్యం కోసం మనిషి ఎక్కవలసిన సోపానాలే. సాంఖ్యబుద్ధి, యోగబుద్ధి ఉన్నప్పుడే ఇహపర సౌఖ్యాలు రెండింటికీ అతడు చేరువలో ఉంటాడని చెప్పే సందేశం అన్ని అధ్యాయాల్లో అంతర్లీనమై ఉంటుంది. అందులోని జ్ఞానయోగం మనిషి తన బుద్ధిభావనలు నిర్మూలించుకుని ఆత్మావలోకనం దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. కర్మయోగం అతడిని ధర్మవిరుద్ధమైన కర్మలజోలికి పోవద్దంటుంది. అవన్నీ ధర్మానుసారంగా జరపడమెలాగో చెబుతుంది. నిష్క్రియ జీవితానికి ప్రత్యామ్నాయం కాకుండా చూసుకుంటూ, కర్మయోగిలా జీవించమంటుంది. మనిషి చేసే కర్మలన్నీ పురుష ప్రయత్నాలేనని, ఈశ్వరార్పణంగా, ఫలాపేక్ష లేకుండా వాటిని చేపట్టినప్పుడు జరిగేదే విధి నిర్ణయం అని చెబుతూ, అది ఎలాగ ఉంటుందో అతడు తెలుసుకోలేడంటుంది. భక్తియోగం, భగవంతుడిని చేరుకోవాలన్న తపనలో ఉండే అతడికి, సుగమమైన మార్గాలనే సూచిస్తూ, ఆధ్యాత్మిక సాధనలను సులభతరం చేస్తుంది. రాజయోగం, బుద్ధిని ప్రాపంచికపరమైన ఆలోచనలనుంచి దూరంగా ఉంచి, భావరహితస్థితికి చేర్చి, అంతిమ సత్యమైన ఆ భగవంతుడొక్కడినే అతడికి చూపించగల సాధనలు నేర్పిస్తుంది.

భగవద్గీత ఆధ్యాత్మికులకే పరిమితం కాదు. అది మతగ్రంథమూ కాదు. చదువుతున్నకొద్దీ వ్యక్తిత్వ వికాసం అనే మాటకు సమగ్రమైన వివరణలు ఇవ్వగల కరదీపికలాంటి మహాగ్రంథమది. గీతాపారాయణంతో మనిషి, నిత్యమేదో సత్యమేదో తెలుసుకుంటూ, తన జీవిత గమనానికి తానే దిశానిర్దేశం చేసుకోగల సమర్థుడవుతాడు. గీత అనే గంగలో మునిగి ఒక్క స్నానం చేస్తే భౌతికజీవన కాలుష్యాలన్నీ తొలగిపోతాయని ధార్మికులందరి దృఢవిశ్వాసం. సమయం చేసుకుని ఒకేసారి కాకపోయినా వీలున్నప్పుడల్లా జీవితకాలమంతా చదువుకుంటూ పోతూఉంటే, శైశవదశలో ఉన్న ఆ మనిషి ఆధ్యాత్మికత శిఖరాగ్రానికి చేరుకుంటుంది.

- జొన్నలగడ్డ నారాయణమూర్తి

శ్రీ గర్భరక్షా స్తోత్రం


 




 


ఓం శ్రీ గణేశాయ నమః    
ఓం శ్రీమాత్రే నమః

ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
        

పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.


·         2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు
·         3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు
·         4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు
·         5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు
·         6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు
·         7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు
·         8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు
·         9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు

Wednesday, March 13, 2019

వివేకం (సేకరణ- ఈనాడు పేపర్ నుండి)





మౌల్వీ నసీరుద్దీన్‌ కథల్లో మనిషికి కనువిప్పు కలిగించే ఉదంతం ఒకటుంది. తైమూరు ఆ దేశపు రాజు. ఆయనకో రోజు ఎందుకో తన ఆస్థానంలో మూర్ఖులు పెరిగిపోయారని   అనుమానం వచ్చింది. వెంటనే మంత్రి  నసీరుద్దీన్‌ను పిలిపించాడు. తన కొలువులోని మూర్ఖుల జాబితా తయారు చేయమని పురమాయించాడు.

నసీరుద్దీన్‌ ఒక పట్టిక రూపొందిస్తూ మొదటే రాజుగారి పేరు రాశాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. మంత్రి మన్నించమని అడుగుతూనే, ‘ప్రభూ! మన  దివాణంలో మూర్ఖులున్నారని తెలిసీ, వారికి వృథాగా జీతభత్యాలిచ్చి పోషిస్తున్నారంటే- ఈ జాబితాలో మొట్టమొదటివారు మరి మీరే కదా!’ అని ప్రశ్నించాడు.

తైమూరుకు కోపం పెరిగిపోయింది. ‘నా దగ్గర పనిచేసేవాళ్లంతా తెలివైనవారేనని నిరూపణ అయితే, నీకు ఏం శిక్ష వేయవచ్చు’ అని ప్రశ్నించాడు. నసీరుద్దీన్‌ బదులిస్తూ,  ‘తెలివైనవారిని అనుమానించడం, అవమానించడం మూర్ఖుడి స్వభావం కనుక, అప్పుడూ మీ పేరే ముందుంటుంది’ అన్నాడు.

తైమూరుకు ఈసారి తిక్క పెరిగిపోయింది. ‘నా ఉద్యోగులందరూ ఎంతో వివేకవంతులు... వారందరిలో నువ్వు ఒక్కడివే పరమ మూర్ఖుడివని రుజువు చేస్తా చూడు’ అని సవాలు విసిరాడు. ‘అప్పటికీ మొదటిస్థానంలో మీరే ఉంటారు మహాప్రభూ’ అన్నాడు నసీరుద్దీన్‌. ‘రాజోద్యోగులందరూ చక్కని బుద్ధిమంతులై ఉండగా, మూర్ఖుల జాబితా రాయమని ఒక మూర్ఖుడికి పని పురమాయించినవాడు అందరికన్నా మూర్ఖుడు. అవునా, కాదా! మీరే ప్రశాంతంగా ఆలోచించండి’ అని విన్నవించాడు మంత్రి.

‘మరణించేలోగా ఈ లోకంలోని మూర్ఖుల సంఖ్యలోంచి ఒకటి తగ్గేలా చూడు... అదెవరో కాదు, నువ్వే!’ అని సుప్రసిద్ధ తత్వవేత్త పైథాగరస్‌ చెప్పిన మాట ఇలాంటి సందర్భాలకు అతికినట్లు సరిపోతుంది. ‘ఆ విషయంలో చాలా మూర్ఖంగా వ్యవహరించాను’ అని జీవితంలో చింతించనివారంటూ లోకంలో ఉండరు. చాలా సందర్భాల్లో మూర్ఖంగా ఆలోచించడం మనిషి స్వభావంలోనే ఉంది. వాటిని గుర్తించి మరోసారి అలా ప్రవర్తించకపోవడంలోనే మనిషి సంస్కారం వెల్లడవుతుంది.

‘నాది గట్టి పట్టుదల’ అని నమ్ముతాడు భర్త. ‘ఆయన వట్టి మొండిఘటం... చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని నిట్టూరుస్తుంది భార్య. ఇల్లాళ్లు ఎంతో నేర్పుగా చక్కబెట్టామని భావించే పనులు, చవగ్గా బేరం చేశామనుకొనే వస్తువులు భర్తలకు మాత్రం మూర్ఖత్వానికి రుజువులుగా కనిపిస్తాయి. ‘మూర్ఖురాళ్ల మనసు రంజింపజేయడం మన వల్ల కాదు’ అనుకొంటూ సర్దుకుపోతుంటారు భర్తలు.

జపాన్‌ మల్లయోధులను ‘సమురాయ్‌’ అంటుంటారు. అలాంటివారిలో ఒకడు రాజయ్యాడు. ఆయనకు ఉన్నట్లుండి స్వర్గానికి, నరకానికి తేడా ఏమిటన్న సందేహం వచ్చింది. అప్పటికప్పుడే తన ఆధ్యాత్మిక గురువు ఆశ్రమానికి పరుగెత్తి, ఆయన ప్రశాంతంగా జపం చేసుకుంటుంటే పట్టి కుదిపాడు. ఆయన కళ్లు తెరిచి విన్నా, ఈ సందేహాన్ని పట్టించుకోలేదు. జవాబు చెప్పలేదు. రాజుకు అసహనం, పంతం పెరిగిపోయాయి. తీవ్ర క్రోధంతో కత్తి దూసి గురువు తల నరికేయబోయాడు.

గురువు అప్పుడు చిన్ననవ్వు నవ్వి ‘ఇప్పుడు నువ్వున్నది నరకంలోనే’ అన్నాడు. ఆ మాటలోని అంతరార్థం తోచగానే రాజు నిలువునా నీరైపోయాడు.  ‘అయ్యో! ఎంత మూర్ఖంగా వ్యవహరించాను’ అంటూ గురువు కాళ్ల మీదపడి వలవల ఏడ్చాడు. అతణ్ని లేపి లాలనగా చెప్పాడు గురువు- ‘ఇప్పుడు స్వర్గంలో ఉన్నావు నువ్వు’ అని.

మూర్ఖంగా వ్యవహరించిన ప్రతి సందర్భం ఎదుటా మనిషి సరిగ్గా ఇలాగే మోకరిల్లి ఆత్మ పరిశీలన చేసుకొంటే- పైథాగరస్‌ కోరికను నిజం చేయడం సాధ్యమవుతుంది. నరకం లాంటి ఈ లోకం స్వర్గం అవుతుంది!

- వై.శ్రీలక్ష్మి

Monday, March 4, 2019

దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!


నమఃశివాయలో... ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’ మరుత్‌ (వాయువు), ‘శి’ శిఖి (అగ్ని), ‘వా’ వారి (జలం), ‘య’ అంటే యజ్ఞం (భూమి). ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వపాపాలూ హరించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం. మిగిలిన నాలుగూ ఫృథ్వీలింగం (కాంచీపురం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (తిరువణ్నామలై), ఆకాశలింగం (చిదంబరం) తమిళనాడులో ఉన్నాయి. కాళహస్తీశ్వరుడు వాయు లింగం రూపంలో ఉన్నాడనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన ఉన్న రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుందట.



 

బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన క్షేత్రం 
కృతయుగం ప్రారంభంలో బ్రహ్మ దేవుడు మహా శివుడి ఆజ్ఞను ధిక్కరించడం వల్ల అజ్ఞానంతో సృష్టి కార్య నిర్వహణలో విఫలమవుతాడు. పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగిపొందేందుకు కైలాసంలో తేజోవిరాజితమైన శివానందైక నిలయమనే శిఖరాన్ని తన భుజస్కంధాలపై తీసుకుని భూలోకంలో ఓ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటాడు. ఆ ప్రకారంగా శివానందైక శిఖరాన్ని కాశీ క్షేత్రానికి 190 యోజనాల దూరంలో దించుతాడు బ్రహ్మ. అక్కడ పంచముఖాలతో కూడిన మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, శాపం నుంచి విమోచనం పొందుతాడు. అలా శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం దాదాపు 5500 ఎకరాల్లో ఈ కైలాసగిం¹ులు విస్తరించి ఉన్నాయి. బ్రహ్మదేవుడి మాదిరిగానే వాయులింగేశ్వరుడి దేవేరి అయిన పార్వతీ దేవి కూడా శివుడి కోసం తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందడంతో ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువుదీరింది.

 

భక్తుల పేరుతోనే... 
శ్రీ (సాలీడు), కాళము (సర్పం), హస్తి (ఏనుగు)... ఈ మూడు మూగ జీవాల భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన శివుడు ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిగా కొలువు దీరాడు. అదెలాగంటే... పూర్వం తామ్రపర్ణీ నదీ తీరంలో నివసించే కరబుడు చీరల అల్లకంలో దిట్ట. పుట్టినప్పట్నుంచీ శివ భక్తుడైన అతడు దుష్ట సావాసంతో శివారాధన విస్మరించి, వైదిక ధర్మాలను విడిచి పెట్టడంతో అనారోగ్యానికి గురై తనువు చాలించాడు. మరుజన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు. ఈ సాలీడు తన దారాలతో వాయులింగేశ్వరుడికి కైలాసంలో ఉన్నట్లు వేదికలూ భవనాలను అల్లుతూ ఉండేదట. దాని భక్తిని పరీక్షించదలచి ఓరోజు శివయ్య ఆ అల్లికలను అగ్నికి ఆహుతి చేశాడట. అది చూసి భరించలేక అగ్నిలో దూకిన సాలీడుకి శివుడు సాయుజ్యాన్ని ప్రసాదించాడు.

కాళము(సర్పం)... హస్తి(ఏనుగు)ల కథ కూడా ఇలాంటిదే. లోగడ ఇద్దరు శివ భక్తులు పూర్వ జన్మ పాపాలతో అష్టకష్టాలూ పడుతూ వచ్చారు. ఆ ఇద్దరూ మరు జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం, ఏనుగు రూపాల్లో జన్మించారు. పాము రోజూ ఓ మణిని తీసుకొచ్చి లింగానికి అర్పించి పూజలు చేస్తూ ఉండేది. కొన్నాళ్లకు అక్కడ లింగాన్ని చూసిన ఏనుగు స్వర్ణముఖీ నదిలో స్నానమాచరించి తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి, మారేడు బిల్వ పత్రాలతో శివార్చన చెయ్యడం మొదలు పెట్టింది. అయితే ఏనుగు మరుసటి రోజు వచ్చేసరికి మారేడు దళాలన్నీ కిందపడిపోయి ఉండేవి. అది చూసి ఏనుగు అసంతృప్తి చెందేది. సర్పం కూడా తాను దేవుడికి అర్పిస్తున్న మణి కింద పడిపోయి ఉండటం వల్ల ఎందుకిలా జరుగుతోందని ఆలోచించింది. విషయం తెలుసుకుందామని ఓరోజు లింగాన్ని చుట్టుకుని పడుకుంది. ఆ సమయంలో ఏనుగు రావడం, పూజ చేసేందుకు మణిని పక్కకు తొయ్యడం చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. దాంతో బాధను తట్టుకోలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీ కొట్టడంతో రెండు జీవులూ శివైక్యం పొందాయి. అలా ఈ క్షేత్రం శ్రీ కాళహస్తి అయింది.

మహా భక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్లనే తీసిచ్చింది ఇక్కడి శివుడికే. అందుకే, కాళహస్తిలో తొలి పూజను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప.

 

రాహు కేతు పూజలతో ఖ్యాతి 
పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి దక్షిణకైలాసంలోనే పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనిమిచ్చాడట శివయ్య. ఆ నాగరూపం కారణంగానే కాళహస్తి ‘రాహు కేతు క్షేత్రం’గా కూడా వర్ధిల్లుతోంది. సర్ప దోషం, రాహు కేతు గ్రహ దోషాల నుంచి నివారణ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయానికి వెళ్తే మహాదేవుడి దర్శనంతో పాటు అలనాటి శిల్పకళా వైభవాన్నీ దర్శించుకోవచ్చు. పాతాళ వినాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల విజయస్తంభం, జలవినాయకుడి ఆలయం, భరద్వాజ తీర్థం, వేయి లింగాల తీర్థం, ఆలయానికి దక్షిణం వైపున ఉన్న బ్రహ్మ గుడి... ఇలా దర్శించుకోదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాళహస్తిలో.

- బ్రహ్మాండం రాజేష్‌ కుమార్‌, న్యూస్‌టుడే, కాళహస్తి