
వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అన్నదాతలు అత్యంతానందంగా చేసుకునే పండుగల్లో ఏరువాక పూర్ణిమ ఎంతో ముఖ్యమైంది. జ్యేష్ఠశుద్ధ పూర్ణిమనాడు ఈ పర్వదినాన్ని రైతులు, కర్షకులు, కార్మికులు సకుటుంబంగా ఉత్సాహంతో జరుపుకొంటారు. ఈ పున్నమినే కృషిపూర్ణిమ, హలపూర్ణిమ అని పిలుస్తారు.
పొలం దున్నడానికి మంచి నక్షత్రం ‘జ్యేష్ఠ’ అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జ్యేష్ఠ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండగా ఏర్పడేది జ్యేష్ఠ పూర్ణిమ. సకల ఓషధులకు అధిపతి చంద్రుడు. ఓషధులు సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయానికి విశేషమైన ఫలసాయం అందుతుంది. వర్షరుతువు ప్రారంభంలో జరుపుకొనే ఈ రోజునే కర్షకులు, కార్మికులు క్షేత్రపాలుణ్ని స్తోత్రం చేస్తారని ‘రుగ్వేదం’ చెబుతోంది. నాగలి చాలు నుంచి ఇదే రోజున సీత ఆవిర్భవించటం వల్ల ఈ పూర్ణిమను ‘సీతాయజ్ఞ’మనీ పిలుస్తారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మే ఏరువాక పూజ ప్రారంభించినట్లు పురాణ కథనం.
ఉత్తర భారతాన ఈ పర్వదినాన ‘ఉద్వృషభ యజ్ఞం’ పేరుతో వృషభాలను పూజిస్తారు. జైమిని న్యాయమాలలో విష్ణుపురాణంలో ఈ పండుగను జరుపుకొనే ఆచారమున్న ఉదంతం కనిపిస్తుంది. బౌద్ధ జాతక కథల్లోని ‘వప్పమంగలదివస’ ఏరువాకతో పోలిందే! శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్షరుతువు రాగానే రైతుకు బంగారు నాగళ్లు బహూకరించి ఏరువాక వేడుకలు ప్రారంభించేవాడని ‘లలితవిస్తరం’ అనే గ్రంథం పేర్కొంది.
‘హాలుడి గాథాసప్తశతి’లోను ఈ పండుగ ప్రస్తావన ఉంది. ఈ పండుగను ‘అనడుత్సవం’ పేరుతో నిర్వహించే సంప్రదాయం ఉన్నట్లు అధర్వణ వేదం చెబుతోంది. హలకర్మ పేరుతో నాగలిపూజ మేదినీ ఉత్సవం పేరుతో భూమిపూజ, ‘వృషభ సౌభాగ్యం’ పేరుతో పశుపూజ జరుపుతారని వేదం వర్ణించింది. వరాహమిహిరుడు రాసిన బృహత్సంహితలో, పరాశర విరచిత కృషి పరాశరంలో ఈ ఉత్సవాల ఉదంతం ఉంది. కర్ణాటకలో ఈ పండుగను ‘కారణిపబ్బం’ పేరుతో పిలుస్తారు. వర్షానికి అధిదేవతైన ఇంద్రుణ్ని పూజించి, పొంగలిని నివేదన చేస్తారు. ఈ పున్నమినాడే మహిళలు వటసావిత్రి వ్రతం చేస్తారు. యముడి వెంటపడి, మృతుడైన తన పతి సత్యవంతుణ్ని బతికించుకుని, తిరిగి భూలోకానికి వచ్చిన సతీసావిత్రిని అర్చిస్తూ ముత్తయిదువలు తమ సౌభాగ్య సంపద కోసం ఆచరించే పుణ్య వ్రతమిది.
ఈ పౌర్ణమినాడు పద్మపురాణ గ్రంథాన్ని దానం చెయ్యడం అశ్వమేధ ఫలతుల్యమని శాస్త్రం చెబుతోంది. ‘కృష్ణాజినం’ మీద కొంతసేపు కూర్చొని వాసుదేవుణ్ని స్మరించటం, దాన్ని విప్రులకు దానం చేసే ఆనవాయితీ ఉందనీ చెబుతారు. ఐరోపా దేశాల్లో ‘మేషోవ్’ అనే పేరుతో ఈ పండుగ చేసుకుంటారట.
‘ఏరు’ అంటే నాగలి అని, ‘ఏరువాక’ అంటే దుక్కి ప్రారంభ దినమని అర్థాలున్నాయి. ఈ రోజున నాగలిని, వ్యవసాయ పరికరాలను, ఎడ్లను చక్కగా అలంకరించి రైతులు భక్తితో పూజలు చేస్తారు. మంగళవాద్యాలతో ఎడ్లను కట్టిన నాగళ్లను ఊరేగిస్తారు. గోగునారతో చేసిన తోరణాలు కట్టి, వాటిని చర్నాకోలతో కొట్టి, ఎవరికి దొరికిన పీచును వారు ప్రసాదంగా తీసుకెళతారు. కొన్ని ప్రాంతాల్లో కాడికి ఓ వైపున ఎద్దును కట్టి మరోవైపు రైతులే భుజాన వేసుకుని భూమిని దున్నే ఆచారం ఉంది. ఎడ్లను పరుగెత్తిస్తూ పందేలు కాసే ఆచారమూ కొన్ని ప్రాంతాల్లో ఉంది. పారస్కరుడు తన గృహసూత్రాల్లో హలకర్మకు జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలు అనుకూలమైనవిగా వర్ణించి, మంచి వ్యవసాయ విషయ పరిజ్ఞానం అందించాడు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
No comments:
Post a Comment